News

ఇంద్రకీలాద్రిపై శ్రీపంచమి పర్వదినం

228views

పర్వదినాల మాసం.. మాఘమాసం. జనవరి 23న మాఘ శుద్ధ పంచమి. ఈ శ్రీ పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు భక్తులకు శ్రీ దుర్గమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. దీంతో ప్రధాన ఆలయంలో అమ్మవారి మూల స్వరూపానికి ప్రత్యేక అలంకరణతో పాటు, మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక.. ఆరో అంతస్తులో దాదాపు 500 మంది విద్యార్థులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నారు.

అలాగే.. యాగశాలలో శ్రీ సరస్వతీ హోమం సహా పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీ పంచమి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సరస్వతీ దేవి రూపంలో అమ్మవారిని విద్యార్థులు ఉచిత దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం విద్యార్థులకు పెన్ను, శక్తి కంకణం, అమ్మవారి ఫొటోతో పాటు 40 గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తామని దేవస్థానం ఉన్నతాధికారులు వెల్లడించారు.

శుక్రవారం వచ్చే ఈ వసంత పంచమి రోజున.. స్కూల్ యూనిఫామ్ ధరించి, గుర్తింపు కార్డుతో వచ్చే విద్యార్థులకే ఉచిత దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు వివరించారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.