ArticlesNews

‘‘పహుడా’’ కాదని 31 అర్ధరాత్రి దేవాలయాన్ని తెరుస్తారా? ఆచారానికే భంగం’’

266views
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా అందరూ దేవాలయాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంవత్సరం ఆయా రాష్ట్రాల ప్రకారం నూతన సంవత్సరం కాదని, అదో ఆంగ్లం నూతన సంవత్సరం అని తెలిసినా… అందరూ దేవాలయాలకు వెళ్లడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన పూరీ జగన్నాథ ఆలయాన్ని డిసెంబర్ 31 అర్ధరాత్రిన (అంటే జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా) తెరిచి వుంచే సంప్రదాయాన్ని, దేవతలను మేల్కొని వుంచే సంప్రదాయానికి స్వస్తి పలకాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
శ్రీ జగన్నాథ ఆలయ నిర్వహణ కమిటీ సభ్యుడు మహేష్ సాహూ ఈ మేరకు ఆలయ అధికారులకు, ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ గజపతి మహారాజా దివ్యాసింగ్ దేవ్ కి కూడా లేఖ రాశారు. ఇలా డిసెంబర్ 31 అర్ధరాత్రిన ఆలయ తలుపులు తెరిచి వుంచడం సనాతన సంప్రదాయానికి అలాగే సుదీర్ఘంగా వస్తోన్న ఆలయ ఆచారాలకు కూడా పూర్తి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
భగవాన్ జగన్నాథుడు, భగవాన్ బలభద్రుడు మరియు దేవి సుభద్రలతో పాటు, సనాతన హిందువుల ప్రధాన దేవత అని, గౌరవనీయమైన వైష్ణవ మందిరంలోని అన్ని ఆచారాలు పురాతన హిందూ గ్రంథాలు మరియు శతాబ్దాల నాటి ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగానే నిర్వహణ జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అర్థరాత్రి ఆలయాన్ని తెరుస్తున్నారని, ఇదో సంప్రదాయంగా మారిపోయిందని మహేష్ సాహు లేఖలో పేర్కొన్నారు. ఇలా తెరవడం అనేది మతాచారం ప్రకారం సరైందని కాదని, ఆలయ సంప్రదాయానికి కూడా విరుద్ధమని లేఖలో దుయ్యబట్టారు. మత పరంగా ఇది అత్యంత సున్నితమైన అంశమని ఆయన అన్నారు. సంప్రదాయాన్ని ఉల్లంఘించకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
జనవరి 1 వ తేదీని జరుపుకోవడం అనేది హిందూ సంప్రదాయం కానేకాదని అన్నారు. దేవతలు విశ్రాంతి తీుకునే కాలాన్ని ‘‘పహుడా’’ అంటారని, దీని తర్వాత వెంటనే ఆలయాన్ని తెరవడం ఆలయ నిబంధనలకే విరుద్ధమన్నారు. దేవతలకూ తగిన విశ్రాంతి అవసరమని, పాశ్చాత్య వేడుకలకు అనుగుణంగా ఆలయ ఆచారాలను మార్చొద్దని కోరారు. జనవరి 1 నూతన సంవత్సరం జరుపుకోవడం మన సంప్రదాయమే కాదని, దేవతలను మేల్కొని వుంచడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని, దీనిని వెంటనే ఆపాలన్నారు.