News

మారేడుమిల్లి కాల్పులలో మోస్ట్‌ వాంటెడ్‌ హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టుల మృతి

213views

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్‌ సురేశ్‌, టెక్‌ శంకర్ ఉన్నారు. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల మృతదేహాలను తీసుకొచ్చిన నేపథ్యంలో మార్చురీ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్‌ నిర్వహించినట్లు చెప్పారు.

మద్వి హిడ్మా, రాజీ మృతదేహాలు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూర్వాటి గ్రామంలో జన్మించిన మద్వి హిడ్మా.. బస్తర్‌ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. చిన్నవయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుపొందారు. పీపుల్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోనూ..

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోనూ ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ తెలిపారు.