
339views
భారత దేశ భవిష్యత్తు కేవలం ఆర్థిక వ్యవస్థే కాదని, దాని సంస్కృతి, సమగ్ర వికాసం, చరిత్ర, సంపూర్ణ జ్ఞాన సాధన ద్వారా కూడా నిర్ణయించబడుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. వారణాసి కేంద్రంగా ‘‘కాశీ శబ్దోత్సవ్’’ అనే సాహిత్య సమావేశం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగింది. దీనికి ముఖ్య వక్తగా అంబేకర్ హాజరయ్యారు.
వారణాసి కేంద్రంగా కనిపించే ఆధునికత, భారతీయ జ్ఞాన సంప్రదాయం అనే విశిష్ట సంగమం దేశానికి నిజమైన బలమని, దార్శనికతకు కూడా చిహ్నమని అన్నారు.భారతదేశ సాంస్కృతిక స్రవంతిలో నూతన ఆవిష్కరణ, సంప్రదాయం మధ్య ఎన్నడూ ఘర్షణ జరగలేదని, బదులుగా మన సంప్రదాయం కొత్త పరిస్థితులకు అనుగుణంగా పురాతన సంప్రదాయ జ్ఞానాన్ని మూల్యాంకనం కూడా జరుగుతుందన్నారు.
అలాగే కాలం ఎంత మారినా, కొత్త పాత అనే అస్తిత్వాల చుట్టూ తిరగకుండా ఒకే ప్రవాహంలా, రెండు కోణలు అన్న దృక్పథంతోనే కొనసాగాయన్నారు. ఈ సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కాశీ వేదికగా జరుగుతున్న కాశీ శబ్దోత్సవ్ ఆధునిక ప్రపంచ శ్రేయస్సు కోసం ఓ కొత్త మంత్రాన్ని అందిస్తోందని అభినందించారు.
భారత దేశంలో వున్న సంప్రదాయ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కలిపి, సమగ్ర విద్యా వ్యవస్థను సృష్టించడం కోసమే బనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపనకు స్ఫూర్తి అయ్యిందని వివరించారు.ఈ సమన్వయం దేశవ్యాప్తంగా జాతీయ విద్యా ఉద్యమానికి కొత్త శక్తిని అందించిందని, మహారాష్ట్రతో సహా దేశంలోని అనేక ప్రాంతాలలో విద్యా సంస్థల స్థాపనకు కేంద్రమైందన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకుడైన డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా ఈ జాతీయ విద్యా సంప్రదాయంలో భాగమయ్యారని అంబేకర్ పేర్కొన్నారు. వందేమాతరం అని నినదించినందుకు బ్రిటీష్ పాలనలోని నీల్ సిటీ స్కూల్ నుంచి డాక్టర్జీని బహిష్కరించారని, ఆ తర్వాత యావత్ మాల్ నేషనల్ స్కూల్‌లో చదువుకున్నారని అన్నారు.తరువాత అతను కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో కూడా చదువుకున్నారని తెలిపారు.భారతదేశం ప్రపంచం నుండి కొత్త జ్ఞానాన్ని స్వీకరించినప్పటికీ, తనదైన జ్ఞానాన్ని ఎప్పటికీ వదులుకోలేదని అన్నారు.
ఈ సమగ్ర విధానం కారణంగా, భారతదేశంలోని అనేక జ్ఞాన శాఖలు విదేశీ దండయాత్రలు మరియు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని కూడా మనుగడ సాగించాయన్నారు.ఈ ప్రయత్నాలు జరగకపోతే, భారతీయ జ్ఞానాన్ని, సంస్కృతిని పూర్తిగా నాశనం చేయాలనుకున్న పాశ్చాత్య సామ్రాజ్యవాద శక్తుల కుట్ర విజయవంతమై ఉండేదని పేర్కొన్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం అవిచ్ఛిన్న సంప్రదాయానికి శక్తిమంతమైన వాహకం అని అభివర్ణించారు.

నేడు భారత దేశం ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తున్నప్పటికీ, అది తన ‘సాస్కృతిక విలువలు – సాత్వికత, కరుణ, వసుధైవ కుటుంబకం మరియు సమతుల్య జీవితాన్ని కొనసాగించాలని, అదే నేటి సవాల్ అని వివరించారు.కోవిడ్ మహమ్మారి సమయంలో మార్కెట్, లాభం అన్న ధృక్కోణం నుంచి కాకుండా మానవత్వం అన్న ధృక్కోణం నుంచి ప్రపంచానికి టీకాలు అందించిందన్నారు.
నేడు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉందని అంబేకర్ పేర్కొన్నారు. సైన్స్, టెక్నాలజీ, పరిశోధన మరియు ఆవిష్కరణలు స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.కానీ ఆర్థిక పురోగతితో పాటు, కేవలం GDPపై మాత్రమే కాకుండా, సంస్కృతి, పర్యావరణం, కుటుంబం, నైతికత మరియు మానవత్వంపై ఆధారపడిన కొత్త అభివృద్ధి నమూనాను సృష్టించడం చాలా అవసరమని నొక్కి చెప్పారు.
ఇక ముఖ్య అతిథిగా విచ్చేసిన అయోధ్య హనుమాన్ నివాస్ అధిపతి ఆచార్య మిథిలాసానంద శరణ్ స్వామీజీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఉన్నతమైందన్నారు. ఏ సమాజమైనా తన మాటలను కాపాడుకోవడం ద్వారా తన గుర్తింపును కాపాడుకుంటుందని అన్నారు. కబీర్, రామానంద్ గురించి కూడా ప్రస్తావిస్తూ.. కాశీ నుండి సామరస్య సందేశం అందించారన్నారు.నేటి తరం తరచుగా పదాలకు అంత విలువ ఇవ్వదని, ప్రతి పదానికీ తనదైన అస్తిత్వం వుంటుందన్నారు.




