News

మీరు రగిలించిన నిప్పు.. మీ ఇంటినే కాలుస్తోంది: అసీం మునీర్‌పై తీవ్ర విమర్శలు

192views

పాకిస్థాన్‌- అఫ్గానిస్థాన్‌ మధ్య ఘర్షణలు మళ్లీ భగ్గుమన్నాయి. అఫ్గాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌పై పాక్‌ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు యువ క్రికెటర్లు సహా పలువురు మృతి చెందారు. ఈ క్రమంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌పై అఫ్గాన్‌ మాజీ ఎంపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్‌ ఎగదోస్తున్న ఉగ్రవాదం అనే మంట.. ఆయన ఇంటినే (పాక్‌ను ఉద్దేశిస్తూ) కాల్చేస్తోందని వ్యాఖ్యానించారు.

తాజా దాడులపై అఫ్గాన్‌ మాజీ ఎంపీ మరియం సోలైమాంఖిల్‌ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. పాక్‌ది పిరికి చర్య అంటూ దాడులను తీవ్రంగా ఖండించారు. భారత్‌, అఫ్గాన్‌లపై పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, దాని సైన్యం దశాబ్దాలుగా ఇదే హింసకు పాల్పడుతోందన్నారు. వాళ్లు చేసే దాడుల్లో యువ క్రికెటర్లు, చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరమన్నారు. ఈ క్రమంలోనే ఆమె పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాలుగా ఉగ్రవాదుల్ని పెంచి, వారిని ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారన్నారు. ‘మీరు ఎగదోసిన మంటే.. మీ సొంత ఇంటిని కాల్చేస్తోందని గుర్తుపెట్టుకోండి’ అని వ్యాఖ్యానించారు.

ఇక, అఫ్గాన్‌కు భారత్‌మద్దతును ఆమె ప్రశంసించారు. ఇటీవల అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ముత్తాఖీ ఇక్కడ పర్యటించిన విషయాన్ని ప్రస్తావించారు. భారత్‌కు అఫ్గాన్‌ దగ్గరవ్వడాన్ని పాక్‌ సహించలేకపోతుందని విమర్శించారు. మా ఇరుదేశాల మధ్య శాంతిని చూడలేకపోతుందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తీవ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా భారత్‌- అఫ్గాన్‌ల మధ్య బలమైన సహకారం ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి అఫ్గాన్‌పై పాక్‌ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో పాకిస్థాన్‌, శ్రీలంక జట్లతో తలపడబోయే ముక్కోణపు సిరీస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు అఫ్గానిస్థాన్‌ క్రికెట్ బోర్డు (ACB) ప్రకటించింది. 48 గంటల కాల్పుల విరమణ పూర్తయిన వెంటనే ఈ దాడులు జరగడం గమనార్హం.