News

దేవీనవరాత్రుల వేళ బంగ్లాదేశ్ లో అమ్మవారి విగ్రహం ధ్వసం

275views

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే ప్రభుత్వ హోం సలహాదారు జహంగీర్ ఆలం చౌదరి హిందూ ఆచారాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే దుర్గాపూజకు ముందే బంగ్లాదేశ్ లో అమ్మవారి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. జమాల్‌పూర్ జిల్లాలోని సరిశబరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తార్యాపారా ఆలయంలో శనివారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వారం రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.
కుష్టియా జిల్లాలోని మీర్పూర్ ఉపజిల్లాలో ఉన్న శ్రీ శ్రీ రక్కా కాళీ ఆలయంలోని కార్తీక, సరస్వతి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయం చూసి ఈ దాడికి పాల్పడ్డారని ఆలయ కమిటీ అధ్యక్షుడు అమరేష్ ఘోష్ తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఒకరిని అరెస్టు చేశారు. నిందితుడిని షిమ్లాపల్లి గ్రామానికి చెందిన 35 ఏళ్ల హబీబుర్ రెహమాన్‌గా గుర్తించారు.

ఆలయ కమిటీ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం, దుర్గా పూజ కోసం కళాకారులు సిద్ధం చేసిన ఏడు విగ్రహాలను నిందితుడు ధ్వంసం చేశాడు. శనివారం రాత్రి కళాకారులు వెళ్లిపోయిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాల తలలు, ఇతర భాగాలను విరగ్గొట్టాడు. ఆదివారం ఉదయం మహాలయ సందర్భంగా ఆలయానికి వచ్చిన కమిటీ సభ్యులు ధ్వంసమైన విగ్రహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.. ఈ వరుస ఘటనలతో బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.