News

ప్రతిష్ఠాత్మక ఇంటర్‌పోల్ ఆసియా కమిటీలో సభ్యదేశంగా భారత్

162views

భారత్ ఇంటర్ పోల ఆసియా కమిటీ సభ్యురాలిగా ఎన్నికైంది. సింగపూర్‌లో శుక్రవారం జరిగిన 25వ ఆసియా ప్రాంతీయ సదస్సులో ఈ ఎన్నిక జరిగింది. పలు దఫాలుగా జరిగిన ఓటింగ్ ప్రక్రియలో భారత్ ఘన విజయం సాధించిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.దీనివల్ల వ్యవస్థీకృత నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్యదేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సభ్యత్వం దోహదపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నేరస్థులను పట్టుకోవడంలో భారత్ తన పాత్రనుమరింత బలోపేతం చేస్తుంది. భారత్‌లో ఇంటర్‌పోల్‌కు సంబంధించిన వ్యవహారాలను సీబీఐ నోడల్ ఏజెన్సీగా (నేషనల్ సెంట్రల్ బ్యూరో) పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. రెడ్ నోటీసులు వంటి అంతర్జాతీయ అభ్యర్థనలను సీబీఐ సమన్వయం చేస్తుంది. భారత దౌత్యవేత్తలు, వివిధ దేశాల్లోని రాయబార కార్యాలయాలు, సీబీఐ అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాల అమలు, భద్రతా వ్యవహారాల్లో భారత్ పెరుగుతున్న నాయకత్వ పటిమకు ఈ ఎన్నిక నిదర్శనమని సీబీఐ పేర్కొంది.