ArticlesNews

జగన్మాతా నమోస్తుతే

330views

( సెప్టెంబరు 22 – శరన్నవరాత్రులు ప్రారంభం )

ముగ్గురమ్మల మూలపుటమ్మను భక్తిశ్రద్ధలతో ఆరాధించే పుణ్యదినాలే శరన్నవరాత్రులు. సదా మనల్ని సంరక్షించే అమ్మవారిని ప్రత్యేకంగా పూజించే శుభ సమయమిది. అహంకారంతో విర్రవీగిన మహిషాసురుని సంహరించి సమస్త లోకాలకు సుఖసంతోషాలను చేకూర్చిన శక్తికి యథాశక్తి కృతజ్ఞతలను తెలియజేసే సందర్భమిది. ఆ జగన్మాతను మనసారా శరణువేడే తరుణమిది.

శరత్కాలే మహా పూజా క్రియతే యా చ వార్షికీ
తస్యాంమమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః

‘దుర్గాసప్తశతి’లోని ఈ శ్లోకాన్ని శరన్నవరాత్రుల్లో పఠించడం శ్రేష్ఠం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అమ్మవారిని నియమనిష్టలతో పూజిస్తే ఈతిబాధలు తొలగి సకల అభీష్టాలూ నెరవేరతాయన్నది పురాణోక్తి.

శైలపుత్రి పార్వతి పరమశివుణ్ణి పొందేందుకు కఠోర తపస్సు చేసింది. ఆ అమ్మ తన పతీశ్వరుని చేరే సమయం కోసం సమస్త లోకాలూ ఎదురుచూశాయి. వారి కుమారసంభవం తారకాసురుని వధించేందుకు హేతువు కాగలదని ఆశపడ్డాయి. నిర్విరామ ధ్యానముద్రలో మునిగిన శంకరుని అందుకు ప్రేరేపించటానికి మన్మథుని సాయం కోరారు. వారి కోరిక సఫలమైంది. తారక వధ జరిగింది. అయితే ముక్కంటి కంటిమంటతో బూడిదగా మారాడు పుష్పబాణుడైన మన్మథుడు. ఆ భస్మం నుంచే భండాసురుడనే రాక్షసుడు ఆవిర్భవించాడు. తన సోదరులైన విషంగుడు, విశుక్రుడు మొదలైన వేలాదిమంది రాక్షసులతో విశ్వవిధ్వంసకారుడు అయ్యాడు. లోకాలన్నీ పరాశక్తిని శరణువేడాయి. ఆమె నుంచి తొమ్మిదేళ్ల బాలిక బాలాత్రిపురసుందరి అవతరించి వారి ప్రాణాలను హరించింది. లోకానికి శాంతినిచ్చింది. మహాలక్ష్మిగా మధుకైటభుని నశింపచేస్తే.. వాగ్దేవిగా ధూమ్రలోచనుని అంతమొందించింది.

మరణం రాకుండా వరం
రాక్షసజాతి మూలకర్త దనువు. ఆతడి మనవడు మహిషుడు అమరత్వం సాధించాలనే తపనతో బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. మరణం సంభవించకుండా వరం కోరుకున్నాడు. బహ్మదేవుడు ప్రత్యామ్నాయం ఆలోచించమన్నప్పుడు.. స్త్రీలు తనను చంపలేరన్న ఆలోచనతో.. వారు తప్ప మరెవరి చేతిలోనూ మరణం రాకూడదని కోరాడు. తనకిక మరణంలేదని విర్రవీగుతూ భోగలాలసతో ముల్లోకాలనూ పీడించసాగాడు. అప్పుడు సర్వదేవతాశక్తిగా అష్టాదశభుజదేవి ఆవిర్భవించింది. దండనాథ, వారాహి, వైష్ణవి, చాముండి, మంత్రిణి.. ఇలా సర్వసైన్య నాయికలతో మహిషుడిపై యుద్ధం ప్రకటించింది. అతిశయించిన గర్వంతో అహంకారంతో, అతివను సౌందర్యసాధనంగానే భావించి కామదృష్టితో చూస్తున్న మహిషుడి సేనపైకి విరుచుకుపడింది. చాముండి, కాళిక వెంటరాగా భీకరయుద్ధంలో మహిషుడి తల నరికి సమస్త లోకాలకు అభయాన్నిచ్చింది. విజయదశమినాడు ప్రబలగా మహిషాసురమర్దిని అవతరించింది. సీతమ్మవారిని అపహరించిన రావణాసురుణ్ణి శ్రీరామచంద్రుడు హతమార్చింది విజయదశమినాడే అని తెలియజేసే పౌరాణిక కథలూ ప్రచారంలో ఉన్నాయి.

క్షమించి దీవిస్తుంది
‘కుపుత్రో జాయేత్‌ తత్‌ క్వచిదపి కుమాతా న భవతి’ అన్నారు. పుత్రుడు చెడ్డవాడైనప్పటికీ తల్లి చూపే ప్రేమ, కరుణ అచంచలం, అపారం.. తన బిడ్డలైన భక్తులు పొరపాట్లు చేసినప్పటికీ క్షమించి దీవిస్తుంది- అన్నది ఆదిశంకరాచార్యుల వారి భావన.

మత్సమః పాతకీ పాపఘ్నీత్వత్సమా న హి
ఏవం జ్ఞాత్వా మహాదేవి యథా యోగ్యం తథా కురునా అంతటి పాపాత్ముడు లేడు. పాపాలను తొలగించే నీ అంతటి తల్లి లేదు. సర్వం తెలిసినదానివి కనుక.. నాకు ఏది అర్హత ఉందో దాన్ని కలిగేలా చెయ్యి- అన్నది ‘దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం’లోని ఈ శ్లోకానికి అర్థం.

మహిషుడి నుంచి మనుషుల వరకూ..
నేనే కర్తను, ఈ పనిని నేనే చేశాను, సర్వసమర్థుణ్ణి- లాంటి అహంకారపూరిత ఆలోచనలతో మనిషి తనకు తానుగా బందీ అవుతున్నాడు. ‘మోహ మూలం అహంకారః’ అన్నది ఉపనిషత్తు వాక్యం. ఆ అహంకారానికి పుట్టినవే అరిషడ్వర్గాలు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంతశ్శత్రువులు. మహిషుడి నుంచి మనుషుల వరకూ వాటి చేతిలో ఓడనివారు ఉండరు. సకలశాస్త్ర కోవిదుడైనప్పటికీ కామం వల్ల రావణుడు ఎందరో స్త్రీలను చెరబట్టి కోరి వినాశనాన్ని తెచ్చుకున్నాడు. క్రోధంవల్ల విశ్వామిత్రుడు వశిష్టుని వందమంది కుమారులను వధించి తీవ్ర పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. ఐదు ఊళ్లైనా ఇవ్వమని అడిగిన పాండుపుత్రుల అభ్యర్థనను లోభంతో తిరస్కరించాడు దుర్యోధనుడు. అది కురుక్షేత్రానికి దారితీసింది.
శుంభనిశుంభులు అన్యోన్య సోదరులు. స్త్రీ వ్యామోహం వారి ఎడబాటుకే కాదు చావుకూ కారణమైంది. కార్తవీర్యార్జునుడనే రాజు తలకెక్కిన మదం వల్ల పరశురాముడి చేతిలో 21 సార్లు భూమండలం మీదున్న రాజవంశాలు అంతమయ్యాయి. శ్రీకృష్ణభగవానుడి వైభవాన్ని చూసి మత్సరంతో రగిలిపోయాడు శిశుపాలుడు. నూరు తప్పులు దాటాక.. శిక్ష పొందాడు. దైవం పట్ల నిరంతర కృతజ్ఞతాభావం చూపాల్సిన మనసును కలుషితంచేసేదే ఈ అరిషడ్వర్గం. సానుకూల దృక్పథం, ప్రకృతి పట్ల ప్రేమ, ధర్మాచరణ ఈ శత్రుమూకను తరిమేసి విజయాన్ని చేకూర్చగలవు.

తనకు భిక్ష వేసిన గృహిణి పట్ల ఆర్ద్రమైంది బాలశంకరుల హృదయం. నిస్వార్థ భక్తితో అమ్మవారిని స్తుతించగా.. ఆయన వాక్కుకు అధీనమై కనకధారలను కురిపించింది జగన్మాత. కంచికి చెందిన మహా భక్తుడైన మూకశంకరులు ధర్మప్రవర్తనతో తదేకదీక్షతో ఆ దేవిని ధ్యానించి, దర్శించి ధన్యమయ్యారు. అలాంటి మహాత్ముల స్ఫూర్తితో, చెదరని భక్తితో మనమంతా అమ్మను ఆశ్రయిద్దాం. ధర్మరక్షణా శక్తినిమ్మని వేడుకుందాం.