
ఇటీవల కొన్ని టీవీ షో లలో, సినిమాలలో మన భారతీయ ఇతిహాసాలను కించపరిచేలాగా కంటెంట్ ఉంటోంది. తాజాగా ఈటీవీ కామెడీ జంక్షన్ అనే ఛానెల్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో హిందువుల ప్రామాణిక గ్రంథాలలో ఒకటైన మహాభారత ఇతిహాసంలో, పాండవులు , కౌరవుల పాత్రలను అతి నీచంగా, అతి జుగుప్సాకరంగా కించపరిచే విధంగా ప్రదర్శించారు. ఆ షో లో చేసే పాత్రలు ద్రౌపదిని గర్ల్ ఫ్రెండ్ ని అనడం, పాండవులను వ్యక్తిత్వ హీనులుగా చిత్రీకరించడం,అలాగే పవిత్రమైన మహాభారత ప్రదర్శనలో ఊ అంటావా మావ ఉఊ అంటావా మావా లాంటి ఐటమ్ సాంగ్స్ ని జోడిస్తూ స్కిట్ చేయడం జరిగింది..
తరతరాలుగా కొట్లాది మంది హిందువులుకు ఆధ్యాత్మిక , నిత్య జీవన శైలికి దిక్సూచి అయిన, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ముఖ్యభూమిక పోషించిన మహాభారాతాన్ని అవమానించడం, ఖచ్చితంగా సనాతన ధర్మీయులను తీవ్రంగా బాధించింది…దాంతో ఈ షో పై హిందువులు ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. హిందువుల మనోభావాలను కించపరిచిన నటీనటులపైన, ఈ స్కిట్ వ్రాసిన రైటర్ పైన, ఈ స్కిట్ నిర్వాహకులపైన, ఈ స్కిట్ న్యాయనిర్ణేతలపైన, ఈ కార్యక్రమం ప్రొడ్యూసర్ పైన ఈ స్కిట్ లో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరిపైన న్యాయబద్ధమైన చట్టపరమైన చర్యలు తీసుకొనవలసినదిగా హిందువులు కోరుకుంటున్నారు. ఇటువంటి దిగజారుడు ప్రదర్శనలు ఇప్పటి మరియు రాబోయే తరానికి చెందిన హిందువులకు, వారి చరిత్ర పట్ల పూర్తి స్థాయిలో తప్పుడు అవగాహన కలిగించే ప్రమాదం ఎంతైనా ఉందని కాబట్టి దీనిపై వెంటనే స్పందించాల్సిందిగా కోరుకుంటున్నారు..





