News

కాంగ్రెస్‌కి ఆరెస్సెస్ శత్రువు కాదు: భోగరాజు పట్టాభి సీతారామయ్య

322views

ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం మళ్లీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆరెస్సెస్‌పై నిషేధం పెడతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1948లోనే ఆరెస్సెస్ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఆనాటి పత్రికల్లోనూ వచ్చాయి.

కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏమాత్రం శత్రువు కాదని సీతారామయ్య స్పష్టం చేశారు. కానీ.. కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలే పార్టీకి అసలైన శత్రువులని కూడా వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ కార్యకర్తలను కాంగ్రెస్‌లో చేరడానికి అనుమతించవచ్చా? అని నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చ వచ్చింది. ఈ సమయంలోనే అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టాభిరామయ్య ఇచ్చిన సమాధానమిది.

“ముస్లిం లీగ్, హిందూ మహాసభలాగా ఆరెస్సెస్ మత-రాజకీయ సంస్థ కాదు. అయితే.. ఇది మతపరమైన సంస్థ కావొచ్చు. కానీ.. రాజకీయాలతో వున్న అన్ని సంబంధాలను కూడా సంఘ్ తిరస్కరించిందని తెలిపారు.

కాంగ్రెస్ నేతలు ఆత్మ విశ్వాసాన్ని బాగా పెంచుకోవాలని, ఆరెస్సెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో ప్రవేశించడం వల్ల పార్టీ బలం దెబ్బతింటుందన్న భావన నుంచి కాంగ్రెస్ సభ్యులు బయటికి రావాలని హితవు పలికారు. మెదడులోంచి ఆ ఆలోచననే తీసేయాలని పట్టాభి సూచించారు.

ఆరెస్సెస్‌ను, ముస్లిం లీగ్, హిందూ మహాసభలను అధిగమించడం కాంగ్రెస్‌కి అత్యంత సులభమని, కానీ కోరుకుంటున్నది అది కాదన్నారు. వారిని అధిగమించడమే కాంగ్రెస్ లక్ష్యం తప్ప అణచివేయడం మాత్రం కాదని అన్నారు.

సంకుచిత దృక్పథం వున్న వారి దృక్పథాన్ని విస్తృతం చేయడం, వారికి కూడా దేశానికి సేవ చేసే భాగ్యం కల్పించడం కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత అని పట్టాభి సీతారామయ్య ఉద్బోధించారు.