
అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ISRO చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో.. ఈ ప్రయోగాలను పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది. మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ వి.నారాయణన్ వెల్లడించారు.
‘‘ప్రస్తుతం ఆ ఉపగ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంది. వివిధ ప్రయోగాలు చేపట్టేందుకు రెండు నెలల్లో 10 నుంచి 15 రోజుల అనుకూల సమయం లభిస్తుంది. ప్రస్తుతం వాటిని విడదీసి, రీ-డాకింగ్ చేసేందుకు అనుకరణ ప్రయోగాలు చేస్తున్నాం. ఇప్పటికే ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం’ అని ఇస్రో ఛైర్మన్ వి.నారయణన్ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మార్చి 15 నుంచి ఈ ప్రయోగాలను చేపడతామన్నారు.
ఉపగ్రహాల్లో తగినంత ఇంధనం ఉందని.. తదుపరి అనేక ప్రయోగాలు చేయాలనుకుంటున్నామని ఇస్రో చీఫ్ వెల్లడించారు. అంతేకాదు, రెండు నెలల తర్వాత వచ్చే అనుకూల సమయంలోనూ మూడో దశ ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. డాకింగ్, దృఢత్వ ప్రయోగాల అనంతరం రెండు ఉపగ్రహాల మధ్య విద్యుత్ శక్తి బదిలీ ప్రయోగాలు చేయాలనే ప్రణాళికలు వేసుకున్నట్లు ఇస్రో గతంలోనే చెప్పింది.
ఇదిలాఉంటే, అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానించే మిషన్‌ను ఇస్రో చేపట్టింది. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్ 30న ఛేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించింది. పలు ప్రయత్నాల అనంతరం చివరకు జనవరి 16న డాకింగ్ ప్రక్రియ -SpaDeX విజయవంతంగా చేపట్టింది. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.




