News

పోలీస్, పారిశుద్ధ్య, ఆరోగ్య కార్యకర్తలకు పదివేల బోనస్ ప్రకటించిన సీఎం యోగి

312views

మహా కుంభమేళా సందర్భంగా పోలీసులు నిర్వర్తించిన విధులపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. 45 రోజుల పాటు సాగిన కుంభమేళాలో కోట్లాది మంది భక్తులను నియంత్రించడంలో భద్రతా సిబ్బంది క్రమశిక్షణగా వ్యవహరించారంటూ ప్రశంసలు కురిపించారు. కుంభమేళా విధులు నిర్వర్తించిన 75 వేల మంది పోలీసులకు 10 వేల రూపాయల చొప్పున ప్రత్యేక బోనస్ ప్రకటించారు. అదేవిధంగా దశల వారీగా వారం రోజుల పాటు సెలువులు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు.

మరోవైపు మహా కుంభమేళాలో పాల్గొన్న పోలీసులతో కలిసి యోగి ఆదిత్యనాథ్ సహపంక్తి భోజనం చేశారు. సిబ్బంది సేవలకు గుర్తింపుగా మహాకుంభ్ సేవా మెడల్స్’’ ప్రదానం చేస్తామని ప్రకటించారు. మౌని అమావాస్య లాంటి కీలక సందర్భాల్లో, అగ్ని ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో ప్రాణనష్టం కలగకుండా, వేగంగా స్పందించారన్నారు. భద్రత సిబ్బంది అద్భుతంగా పనిచేశారన్నారు.

పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలపై ప్రశంసలు…
పోలీసులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలపై కూడా సీఎం యోగి ప్రశంసలు కురిపించారు. వారి సేవలు మరువలేమని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి స్వచ్ఛకుంభ్ ఫండ్ కింద బీమా, బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు.కుంభమేళాలో పాల్గొన్న ప్రతి పారిశుద్ధ్య, ఆరోగ్య కార్యకర్తకి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 10,000 రూపాయల బోనస్ ప్రకటించారు. అలాగే ఆయుష్మాన్ భారత్, లేదా ముఖ్యమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా పారిశుద్ధ్య, ఆరోగ్య కార్యకర్తలందరికీ 5 లక్షల బీమా పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు. అలాగే పారిశుద్ధ్య, ఆరోగ్య కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇది తనకెంతో గర్వకారణంగా వుందని ప్రకటించారు.