
భారతీయ జ్ఞాన సంప్రదాయంలో వేద విద్యావిధానం, సంప్రదాయాలు, నమ్మకాలు, జీవిత విలువలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అన్నారు. మెకాలే విద్యా విధానం భారతీయ సంప్రదాయాలకు, విలువలకు భారీ నష్టం చేకూర్చిందన్నారు. అయినా భారతీయ విజ్ఞాన సంప్రదాయం మరియు వేద విద్యా విధానంపై పనిచేసిన యోధులు భారతదేశంలో భారతీయ మూలాలున్న అద్భుతమైన విద్యావ్యవస్థను తిరిగి స్థాపించడంలో ముఖ్యమైన కృషి చేశారని కొనియాడారు.
ప్రముఖ రచయిత రాజీవ్ మల్హోత్రా, విజయ విశ్వనాథన్ రచించిన ‘‘who is raising your children అన్న పుస్తకా విష్కరణ సభలో ప్రసంగించారు. భారతీయ జీవిత విలువల ఆధారంగా రూపొందించిన ఈ పుస్తకం భారతీయ విద్యావ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందన్నారు. విస్తృతమైన పరిశోధనలు, సంప్రదాయ వాస్తవాలు, ఆధారాలపై ఈ పుస్తకం ఆధారపడిందన్నారు. గత 70 సంవత్సరాలలో భారత విద్యా వ్యవస్థకు జరిగిన నష్టాన్ని జాతీయ విద్యా విధానం ద్వారా భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
భారత విద్యావ్యవస్థను, సమాజాన్ని దెబ్బతీసేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు, సంస్థలు కుట్ర పన్నుతున్నాయన్నారు. కానీ రాజీవ్ మల్హోత్రా, విజయ విశ్వనాథన్ లాంటి వారు కుట్రలను ఛేదిస్తూ… భారతీయ మూలాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని ప్రశంసించారు. భారతీయ సంస్కృతి పరంపర, వేద విద్యలో వున్న అత్యున్నత జ్ఞానం మాత్రమే భారతదేశాన్ని సంపన్న దేశంగా, సంపన్న సమాజంగా మరియు సంపన్న కుటుంబంగా మారుస్తుందని హోసబళే అన్నారు.




