News

శ్రీశైల ప్రాశస్త్యం.. రాగిరేకుల్లో నిక్షిప్తం

230views

శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఘంటా మఠం పునరుద్ధరణ పనులు చేస్తున్న సందర్భంలో లభ్యమైన పురాతన రాగి రేకులపై పలు శాసనాలున్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఎనిమిదేళ్ల కిందట ఇక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టగా, అప్పట్లో 20 సెట్ల రాగి రేకులు (మొత్తం 72), కొన్ని బంగారు నాణేలు దొరికాయి. వాటిని పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, వాటిలోని సమాచారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పరిశోధించారు. 12-16 శతాబ్దాల నాటివిగా భావిస్తున్న ఈ రాగి రేకులపై తెలుగు, సంస్కృతం, ఒడియా, కన్నడ భాషల్లో రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర చక్రవర్తులు కొన్ని శాసనాలు రాయించినట్లు తేల్చారు. శ్రీశైల ఆలయ చరిత్రకు ఇవి ఆధారాలుగా చెబుతున్నారు. ఆలయానికి దాతల వితరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు కూడా ఈ రాగి రేకులపై పొందుపరచారు. ఈ కీలక ఆధారాలతో భారతీయ పురావస్తు శాఖ సంచాలకుడు (ఎపీగ్రఫీ) కె.మునిరత్నంరెడ్డి ఒక పుస్తకం రాశారు. రెండు మూడు నెలల్లో దాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.