News

కాకినాడ తీరంలో ఆకట్టుకున్న టైగర్‌ ట్రయంఫ్‌-24

271views

హోరు గాలులు.. ఉవ్వెతున్న ఎగిసే కెరటాలు.. దూసుకొస్తున్న యుద్ధ నౌకలు.. వాహనాలు.. చక్కెర్లు కొడుతున్న హెలికాప్టర్లు.. జెట్‌ విమానాలు.. పొగ బాంబులు.. అప్రమత్తమైన భారత్‌, అమెరికా రక్షణ బలగాలు.. హెలికాప్టర్లలో క్షతగాత్రులు, వాహన సామగ్రి తరలింపు.. నౌక, వాయు, పదాతి దళాల ఉరుకులు.. పరుగులు.. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు.. కాకినాడ సాగర తీరంలో శుక్రవారం కనిపించిన ఉత్కంఠ వాతావరణమిది. భారత్‌- అమెరికా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాల్లో భాగంగా విశాఖ తీరంలో ఈనెల 18న ప్రారంభించిన ‘టైగర్‌ ట్రయంప్‌- 2024’ శనివారం సూర్యారావుపేట సమీపంలోని సాగర తీరంలో ముగియనున్నాయి. భారత్‌ తరఫున ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌, ఐఎన్‌ఎస్‌ కేశరి యుద్ధ నౌకలు.. ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ ఎసల్ట్‌ (ఎల్‌సీఏ) బృందాలు.. అమెరికా సేన నుంచి జర్మన్‌టౌన్‌ యుద్ధ నౌక, యూఎస్‌ 53 ఎయిర్‌ క్రాఫ్ట్‌, యూఎస్‌3 హెచ్‌ చేతక్‌ హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు.. ఇన్‌ఫెంటరీ బెటాలియన్‌ బృందాల విన్యాసాలు, సహాయక చర్యలు వంటివి ఆకట్టుకున్నాయి. భారత్‌ నుంచి 700, అమెరికా నుంచి 400 మంది త్రివిధ దళాల సైనికులు భాగస్వాములయ్యారు.

ఎలాంటి సవాళ్లయినా ఎదుర్కోగలం
భారత్‌-అమెరికా దేశాలు కలిస్తే ఇండో- ఫసిఫిక్‌ రీజియన్‌లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కోగలమని యూఎస్‌ నేవీ రియర్‌ అడ్మిరల్‌, వైస్‌ కమాండర్‌ జాక్విన్‌ మార్టినైజ్‌ స్పష్టం చేశారు. కాకినాడ తీరంలో ‘టైగర్‌ ట్రయంప్‌’ పేరిట ఇరు దేశాల త్రివిధ దళాల విన్యాసాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సంయుక్తంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జాక్విన్‌ మాట్లాడుతూ భారత్‌- అమెరికా దేశాల ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌లు వేటికవే బలమైనవన్నారు. టైగర్‌ ట్రయంప్‌తో స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడిందని.. సమన్వయంతో సమర్థంగా ఆపరేషన్లు చేయగలమనే నమ్మకం కలిగిందన్నారు. భారత నావికాదళ రియర్‌ అడ్మిరల్‌, ఫ్లాగ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ దన్‌కర్‌ మాట్లాడుతూ విపత్తులు ఎదురైతే సమర్థంగా సేవలందించే సామర్థ్యాలు అలవడినట్లు తెలిపారు. ఇండియన్‌ ఆర్మీ మేజర్‌ జనరల్‌ అఖిలేష్‌కుమార్‌ మాట్లాడుతూ నింగి, జలాల్లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా చివరికి భూభాగానికి చేరుకోవాలని.. భూభాగంలో ఎలాంటి ఆపరేషన్లయినా సమర్థంగా నిర్వహించే నైపుణ్యం సేనలకు ఉందన్నారు. అనంతరం నేవెల్‌ ఎన్‌క్లేవ్‌ సమీప ప్రాంతంలో ఏర్పాటుచేసిన క్యాంపు ప్రాంగణంలో వైద్య శిబిరాలు, డీశాలినేషన్‌ ప్లాంటు, సహాయక చర్యలకు వినియోగించే డ్రోన్ల ప్రదర్శనను సందర్శించారు. యూఎస్‌ కౌన్సిలేటర్‌ జనరల్‌ జెన్నీఫర్‌ లార్సన్‌ విన్యాసాలు వీక్షించారు.