
అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఓ భారతీయురాలిపై లండన్ లోని ఓ విశ్వవిద్యాలయం జాతి వివక్ష చూపింది. పోర్ట్స్ మౌత్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ కాజల్ శర్మ అయిదేళ్ల ఒప్పందం మీద అధ్యాపకురాలిగా పనిచేశారు. 2020 డిసెంబరుతో ఈ ఒప్పందం ముగిసింది. తన అనుభవంతో తిరిగి అధ్యాపకురాలిగా చేరేందుకు దరఖాస్తు చేసుకున్న ఆమెపట్ల విశ్వవిద్యాలయ లైన్ మేనేజర్ ఆచార్య గారీ రీస్ జాతి వివక్ష చూపించి, ఎలాంటి కారణం చూప కుండా దరఖాస్తును తిరస్కరించారు. అనుభవం లేనివారితో ఆ ఖాళీని భర్తీ చేయడమేమిటని బాధితురాలు ప్రశ్నించినా స్పందించలేదు. ఆమె ఫిర్యాదుతో సౌతాంప్టన్లోని ఉపాధి ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. కాజల్ నైపుణ్యాలు, ఉద్యోగ అనుభవాన్ని గుర్తించడంలో రీస్ విఫలమయ్యారని పేర్కొంది. ఈ నియామక ప్రక్రియ పట్ల ఆయన పారదర్శకంగా లేరని, ఆమె దరఖాస్తును తిరస్కరించడానికి సరైన కారణాలు చూపించలేకపోయారని గుర్తించి, బాధితురా లికి 45వేల పౌండ్లు చెల్లించాలని యూనివర్సిటీని ఆదేశించింది.





