News

‘ఎన్నికల బాండ్లు’ రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీం సంచలన తీర్పు

317views

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పునిచ్చింది.

ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సహ చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది.

క్విడ్‌ ప్రోకోకు దారితీసే అవకాశం..
సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే ‘కంపెనీల చట్టం’లో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్‌ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 13 లోగా ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది.

రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్‌ చేస్తూ ఏడీఆర్‌, కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకుర్‌, సీపీఎం, మరో పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబరులో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా నేడు తీర్పును వెలువరించింది.

ఏంటీ ఎన్నికల బాండ్లు..?
ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్‌ లాంటివి. ఇవి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా-SBIలో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.