News

అయోధ్య కొత్త ఆలయం పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపులు

308views

అయోధ్యలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నూతన రామమందిరాన్ని పేల్చేవేస్తామంటూ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర తివారీకి చెందిన ఈ-మొయిల్‌ ఐడీకి కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్​ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది.

2023 డిసెంబర్​ 27వ తేదీన రైతు సంఘ నాయకుడు దేవేంద్ర తివారీకి పాకిస్థాన్​కు చెందిన ఐఎస్​ఐతో సంబంధాలు ఉన్న జుబేర్ ఖాన్ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపాడు. అందులో దేవేంద్ర తివారీతోపాటు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, ఎస్​టీఎఫ్ ఏడీజీ అమితాబ్ యాష్​ను గోసేవకులుగా పేర్కొంటూ బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడు. అయోధ్య నూతన రామమందిరాన్ని కూడా బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు.

దీంతో దేవేంద్ర తివారీ తనకు వచ్చిన బెదిరింపు మెయిల్ స్క్రీన్ షాట్​ను తన ఎక్స్​ (ట్విట్టర్​) అకౌంట్​లో పోస్ట్ చేశారు. యూపీ పోలీసులతోపాటు సీఎం యోగి, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులను ట్యాగ్ చేశారు. ఈ విషయంపై ప్రత్యేక దర్యాప్తును కోరారు. దేవేంద్ర తివారీ ఫిర్యాదు మేరకు లఖ్​నవూలోని సుశాంత్​ గోల్ఫ్ సిటీ పోలీస్​ స్టేషన్ ఇన్​స్పెక్టర్ సహేంద్ర కమార్ కేసు నమోదు చేశారు.

బెదిరింపు మెయిల్​పై దర్యాప్తును మమ్మురం చేశారు పోలీసులు. ఏటీఎస్, ఎస్​టీఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మెయిల్ పంపిన జుబేర్ ఖాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకుముందు కూడా తనకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయని దేవేంద్ర తివారీ తెలిపారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.