News

విదేశీ భక్తుల శివనామస్మరణతో హోరెత్తిన శ్రీకాళహస్తీశ్వరాలయం

444views

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని విదేశీ భక్తులు దర్శించుకున్నారు. జర్మనీకి చెందిన పరమహంస విశ్వానంద స్వామి ఆధ్వర్యంలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియాకు చెందిన 120 మంది భక్త బృందం శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మహాద్వారం ఎదురుగా విజయస్తూపం పై ఉన్న సూక్ష్మ నందిని దర్శించి, సామూహిక శివనామ స్మరణ చేశారు. శ్రీకాళహస్తి దేవస్థాన శిల్ప సౌందర్యానికి విదేశీ భక్తులు మంత్రముగ్ధులయ్యారు. ప్రత్యేక దర్శనం అనంతరం విదేశీ భక్తులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. విదేశీ భక్తులకు కండువా కప్పి తీర్థ ప్రసాదాలు అందించారు. హిందుత్వంలో ఉన్న సంప్రదాయానికి ఆకర్షితులై తామందరం భారతదేశంలో వివిధ ఆలయాలను సందర్శిస్తున్నామని ఆ విదేశీ భక్తులు తెలిపారు. పంచభూతాల్లో ఒకటైన వాయు లింగేశ్వర క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.