News

ద్వారకాతిరుమలలో ధర్మ ప్రచార మాసోత్సవాలు ప్రారంభం

341views

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ధర్మ ప్రచార మాసోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి వారి ప్రచార రథానికి కొబ్బరికాయ కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు. మేళతాళాలు, విచిత్ర వేషధారణల నడుమ క్షేత్ర పురవీధుల్లో రథయాత్ర సాగింది.

హిందూ ధర్మాన్ని వివరించడమే లక్ష్యం..

ప్రతి గ్రామంలో హిందూ ధర్మాన్ని ప్రజలకు వివరించడమే ధర్మ ప్రచార కార్యక్రమ లక్ష్యమని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శ్రీవారి ఆలయంలో ధర్మ ప్రచార మాసోత్సవాల ప్రారంభం సందర్భంగా కొండపైన పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. రూ.5.32 కోట్లతో నిర్మించిన సోలార్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. రూ.10.50 కోట్లతో నిర్మిస్తున్న అనివేటి మండపం రెండో దశ పనులకు, రూ.1.30 కోట్లతో షెడ్డు నిర్మాణానికి, శివాలయం వద్ద రూ.3.35 కోట్లతో నిర్మించనున్న ఐదంతస్తుల రాజగోపురానికి భూమి పూజ చేశారు.