News

ఆధ్యాత్మిక మాసం.. కార్తీకమాసం విశిష్టత ఏమిటి ?

499views

హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మికత కు పెద్ద పీట వేశారు. హిందూ క్యాలెండర్ లో ప్రతి మాసానికీ ఒక విశిష్టత ఉంటుంది. కొన్ని మాసాలకు మరింత ప్రత్యేకత ఉంటుంది. పండుగలు పేరుతో దైవారాధనకు కేటాయించే ప్రత్యేక సమయాలు ఒక ఎత్తైయితే, ఈ ప్రత్యేక మాసాలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.. ఇటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న వాటిలో అతి ముఖ్యమైనది కార్తీక మాసం. కార్తీక మాసం అనగానే సాధారణంగా పరమ శివునికి ప్రీతి పాత్రమైనదిగా భావిస్తారు. కానీ ఇది విష్ణుమూర్తి ఆరాధనకూ అత్యంత ప్రధానమైన మాసం. ఈ నెలలో ఇటు శైవ క్షేత్రాలు.. అటు వైష్ణవ క్షేత్రాలు అన్నిటిలోనూ ప్రత్యేక పూజాదికాలు నిర్వహిస్తారు. ఈ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా కార్తీక మాస విశిష్టతను తెలుసుకుందాం.

అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం “కార్తీకమాసం’. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది.

“న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్”

అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం.

శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

హరిహరాదులకు ప్రీతికరం, కార్తీక మాసం

హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్రపుణ్య నదీ స్నానం ఆచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ ప్రతి నిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్య ఫలం లభిస్తుందని పురాణాలులో చెబుతున్నాయి.

కార్తీక దీపాలు:

ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీస్నానం చేసి శుచిగా, పొడిబట్టలు ధరించి దీపారాధన చేయాలి. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటిముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదలుతారు. దీపారాధన పూజామందిరంలో, దేవాలయాలలో గృహప్రాంగణాలలో, తులసీ బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీతీరాలలో వెలిగించుటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలలో పేర్కొన్నారు.

కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను వుంచి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతో గానీ, కొబ్బరినూనెతో గానీ, నెయ్యితోగాని, అవిశనూనెతో గానీ, ఇప్పనూనెతో గానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి. అంతే కాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం. ఈ విధంగా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.