
ఏసీ అవసరం లేని ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టబోయే ‘వందే సాధారణ్’ రైళ్లు పట్టాలపై పరుగుకు సిద్ధమవుతున్నాయి. ముందుగా దిల్లీ-ముంబయి మార్గంలో వీటిని ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వారంలో వీటి పనితీరును పరీక్షించనున్నారు. వందే సాధారణ్ రైలు ముంబయిలోని వాడిబందర్ యార్డుకు చేరుకుంది. అత్యంత ప్రాచుర్యం పొందిన వందేభారత్ రైళ్ల తరహాలోనే వీటిని డిజైన్ చేశారు. వీటిలో 12 స్లీపర్ కోచ్‌లు, ఎనిమిది అన్ రిజర్వుడు బోగీలు ఉంటాయి. ఒకేసారి 1,834 మంది ప్రయాణించవచ్చు.
గంటకు 130 కి.మీ. వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. వీటిలో ఏసీ సదుపాయం, ఆటోమేటిగ్గా మూసుకునే తలుపులు ఉండవు. బోగీల లోపల అధునాతన సాంకేతికతతో వసతులుంటాయి. తొలిదశలో ఐదు మార్గాల్లో వీటిని ప్రారంభించనున్నారు. తర్వాత మరో 30 మార్గాల్లో ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ యోచిస్తోంది. తమిళనాడులోని పెరంబూరు ఐసీఎఫ్‌లో మూడు విభిన్న సాంకేతికతలతో 400 వందే సాధారణ్ కోచ్‌లను తయారు చేసేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.




