
మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు శ్రీరాముడు. రాజ్యం అంటే రామరాజ్యం.. రాజంటే శ్రీరాముడే అని చాటిచెప్పిన యుగపురుషుడు. సాక్షాత్తూ శ్రీరామచంద్రమూర్తి నడయాడాడని విశ్వసించే అయోధ్యను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తుంటారు. హైదరాబాద్‌వాసి, అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాసశాస్త్రి తన శేష జీవితమంతా అయోధ్య రాముని సేవకే అంకితం అంటున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో శ్రీనివాసశాస్త్రి 5 వెండి ఇటుకలు అందజేశారు. శ్రీరాముడి పాదుకల సాక్షిగా రాజ్యాన్ని పాలించిన భరతుని స్ఫూర్తితో బంగారు పూత పూసిన 9 కిలోల వెండి పాదుకలు సమర్పించబోతున్నారు.
అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం నల్గొండ జిల్లా చండూరులో రూ.91 లక్షలతో వీటిని తయారుచేయించారు. 41 రోజులపాటు అయోధ్యలోని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి, దేశవ్యాప్తంగా చూపించాలని సంకల్పించారు. రామేశ్వరం, ద్రాక్షారామ, అంతర్వేది, సింహాచలం, విజయవాడ, తిరుమల, శృంగేరి, కంచి, కాశీ తదితర పుణ్యక్షేత్రాలు, మఠాల్లో పాదుకలకు పూజలు, అభిషేకాలు చేయించారు. అక్టోబర్ 28న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాక నుంచి 200 మందితో పాదయాత్రగా బయల్దేరనున్నారు. భద్రాచలం, నాసిక్, త్రయంబకేశ్వర్, చిత్రకూట్, ప్రయాగరాజ్ తదితర ప్రాంతాల మీదుగా 2 వేల కి.మీ.లు పాదయాత్ర చేసి, సంక్రాంతి రోజున అయోధ్య ఆలయ కమిటీకి పాదుకలను అందిస్తారు. జనవరి 22న వీటికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.




