News

భారత్‌ వెలుపల ప్రారంభమైన అతిపెద్ద హిందూ దేవాలయం

346views

భారత్‌ వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం రాబిన్స్‌విల్లే నగరంలో ప్రారంభమైంది.మహరాజ్‌ సమక్షంలో భారీ వేడుక నిర్వహించి ప్రారంభించారు. ఈ ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించి.. ప్రారంభోత్సవం సందర్భంగా సెప్టెంబరు 30 నుంచి 9 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారు. ఈ అక్షర్‌ధామ్‌ మహా మందిరంలో ఈ నెల 18 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో 2011లో ఈ నిర్మాణం ప్రారంభమైంది. 183 ఎకరాల్లో అక్షర్‌ధామ్‌ పేరుతో నిర్మితమైన ఈ ఆలయంలో మొత్తం 10 వేల విగ్రహాలు, శిల్పాలు ఉన్నట్లు అంచనా. ఒక ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు భారీ గుమ్మటం ఈ అక్షర్‌ధామ్‌ ప్రత్యేకత.ఇటలీ, బల్గేరియా నుంచి దిగుమతి చేసుకొన్న నాలుగు విభిన్న రకాల పాలరాయి, సున్నపు రాయితో ఈ మందిరాన్ని నిర్మించారు. బ్రహ్మకుండ్‌ అనే పేరుతో ఏర్పాటు చేసిన సంప్రదాయ బావిలో ప్రపంచవ్యాప్తంగా 300 నదుల నుంచి సేకరించిన జలాలను కలిపినట్లు న్యూయార్క్‌ నగర మేయర్‌ కార్యాలయ ఉప కమిషనర్‌ (అంతర్జాతీయ వ్యవహారాలు) దిలీప్‌ చౌహాన్‌ తెలిపారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి విచ్చేస్తున్న హిందువులు, ఇతర మతస్థులు ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటున్నారు.