
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ట్విన్ సీటర్ తొలి విమానాన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HAL భారత వాయుసేనకు అందజేసింది.
బెంగళూరులోని హాల్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీర్ చౌధరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వాయుసేన శిక్షణ అవసరాల అనుగుణంగా ఇద్దరు కూర్చునేలా దీన్ని అభివృద్ధి చేశారు. అత్యవసర సమయంలో పూర్తిస్థాయి యుద్ధ విమానంగా పనిచేసే సామర్థ్యం తేజస్ ట్విన్ సీటర్‌కు ఉందని హాల్ తెలిపింది.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ విమానాలు భారత ఏరోస్పేస్ సామర్థ్యానికి ప్రతీకని హాల్ పేర్కొంది. వీటిలో స్టాటిక్ స్టేబిలిటీ, క్వాడ్రాప్లెక్స్ ప్లై-బై-వైర్ ఫ్లైట్ కంట్రోల్, కేర్‌ఫ్రీ మేనొవరింగ్, ఆధునిక గ్లాస్ కాక్‌పిట్, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఏవియోనిక్స్ సిస్టమ్స్, అత్యాధునిక ఎయిర్‌ఫ్రేమ్ వంటి ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. ఇలాంటి ఫీచర్లు కలిగిన యుద్ధ విమానాలు ప్రపంచంలో కొన్ని దేశాలు వద్ద మాత్రమే ఉన్నాయని, తేజస్ రాకతో వాటి సరసన భారత్ కూడా నిలిచిందని వెల్లడించింది.
వర్థమాన పైలట్లను ట్విన్ సీటర్ పైలట్ల నుంచి పూర్తిస్థాయి ఫైటర్ పైలట్లుగా మార్చాలనే వ్యూహాత్మక లక్ష్యంతో వీటిని డిజైన్ చేసినట్లు తెలిపింది. మొత్తం 18 ట్విన్ సీటర్ తేజస్ యుద్ధ విమానాలను వాయుసేన కోసం కంపెనీ తయారుచేయనుంది. తొలి విడతలో భాగంగా 2023-24 మధ్య కాలంలో ఎనిమిది విమానాలను వాయుసేనకు అందివ్వనుంది. 2026-27 మధ్య మిగిలిన రెండు విమానాలను సిద్ధం చేయనుంది.




