News

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ ; ప్రకటనకు ముందే లీకైన వివరాలు

313views

రసాయన శాస్త్రం లో ఈ ఏడాది నోబెల్‌ అవార్డును రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్‌.. ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి, లూయిస్‌ బ్రూస్‌, అలెక్సీ ఎకిమోవ్‌కు ఈ ఏడాది నోబెల్ ప్రకటించారు. నానోటెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్‌ డాట్స్‌ ఆవిష్కరణలో వీరు చేసిన పరిశోధనలకు గానూ ఈ అవార్డును అందజేస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది.

‘‘క్వాంటమ్‌ డాట్స్‌ అనేవి చాలా సూక్ష్మమైన నానోపార్టికల్స్‌. వీటి ఆవిష్కరణ, అభివృద్ధిలో ఈ ముగ్గురు విస్తృత పరిశోధనలు చేశారు. నానోటెక్నాలజీలోని ఈ క్వాంటమ్‌ డాట్స్‌ను ఇప్పుడు టీవీల నుంచి ఎల్‌ఈడీ లైట్ల వరకు ఎన్నో పరికరాల్లో వినియోగిస్తున్నాం. వైద్యులు కూడా ట్యూమర్‌ కణాలను తొలగించేందుకు ఈ సాంకేతికతనే ఉపయోగిస్తున్నారు’’ అని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ తమ ప్రకటనలో పేర్కొంది.

ప్రకటనకు ముందే లీకైన పేర్లు..

ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాల ప్రకటనలో నేడు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రసాయన శాస్త్రంలో గ్రహీతల పేర్లు అవార్డుల ప్రకటనకు ముందే లీకవ్వడం కలకలంగా మారింది. రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్‌ గ్రహీతల పేర్లను ప్రకటించడానికి కొద్ది గంటల ముందు.. వారి పేర్లను స్వీడిష్‌ మీడియా సంస్థలు తమ కథనాల్లో ప్రచురించాయి. స్వీడన్‌కు చెందిన డాగెన్స్‌ నిహెటర్‌, అధికారిక ప్రసార సంస్థలు స్వీడిష్‌ టెలివిజన్‌, స్వీడిష్‌ రేడియోలో ఈ కథనాలు రావడం గమనార్హం. రాయల్‌ స్వీడిష్ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నుంచి తమకు ప్రెస్‌ నోట్‌ అందిందని ఆ కథనాల్లో పేర్కొన్నారు.

ఈ కథనాలపై అకాడమీకి చెందిన నోబెల్‌ కెమిస్ట్రీ కమిటీ నిపుణులు హీనెర్‌ లింకె స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఇదెలా జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రెస్‌ నోట్‌ ముందే మీడియాకు వెళ్తే మాత్రం అది తీవ్రమైన తప్పిదమే’’ అని అన్నారు.