
భారత దేశపు ప్రాచీన గ్రంధాలలో, సేవ అనేది పరమాత్మ రూపంగా చెప్పబడిందని.. ‘సేవా పరమో ధర్మ: అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు భయ్యాజీ జోషి తెలిపారు. నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్, పూసా ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ విభాగాల్లో సేవాకార్యకర్తలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు భయ్యాజీ జోషి, పరమార్థ నికేతన్ రిషికేశ్ అధ్యక్షుడు పి.హెచ్. స్వామి చిదానంద సరస్వతి , లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు భయ్యాజీ జోషి మాట్లాడుతూ.. కర్మణ్యేవాధికారస్తే…అనే అంశం భారతదేశ రక్తంలోనే ఉందని.. అతిథి దేవో భవ సంస్కృతి భారతదేశానికి చెందినదని అన్నారు. భూమిపై హక్కు జంతువులు, పక్షులు, దేవుళ్లు, మానవులు అందరికీ ఉందని, సేవ రూపంలో భగవంతుడిని ఆరాధిస్తామని, అందుకే సేవా పరిధి పరిమితం కాదని తెలిపారు.
సేవ కోసం డబ్బు, తెలివి, వనరులు అవసరం లేదని, మనస్సాక్షి భావన లేకుండా సేవ సాధ్యం కాదని పేర్కొన్నారు. భగవంతుడిని లోపల నుండి మేల్కొల్పడమే సంత్ ఈశ్వర్ ఫౌండేషన్ చేస్తున్న నిజమైన సేవ అని కొనియాడారు.
అక్టోబరు 2న సంత్ ఈశ్వర్ ఫౌండేషన్, రాష్ట్రీయ సేవా భారతి, అశోక్ సింఘాల్ ఫౌండేషన్‌లు నిర్వహించిన ప్రతిష్టాత్మక సంత్ ఈశ్వర్ సమ్మాన్ వేడుకలో చంద్రయాన్-3 మరియు ఆదిత్య L1 విజయాలపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ “ఇస్రో” ప్రత్యేక గౌరవాన్ని అందుకుంది.




