
ఆన్‌లైన్ వార్తల పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’ కార్యాలయంలో, ఆ సంస్థ పాత్రికేయుల నివాసాల్లో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం మంగళవారం పెద్దఎత్తున సోదాలు నిర్వహించింది. చైనాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించేందుకు ఈ పోర్టల్‌కు నిధులు అందుతున్నాయనే ఆరోపణపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం ‘ఉపా’ కింద ఇదివరకే కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా 30 ప్రాంతాలకు బలగాలు చేరుకుని సోదాలు చేపట్టాయి. పాత్రికేయులు- ఊర్మిలేశ్, అభిశర్ శర్మ, అనింద్యో చక్రవర్తి, పరంజయ్ గుహ థాకుర్తా సహా 37 మందిని లోధీ రోడ్‌లోని ప్రత్యేక విభాగం కార్యాలయానికి తీసుకువెళ్లి అనేక గంటలపాటు ప్రశ్నించారు. 9 మంది మహిళలను వారి నివాసాల్లోనే విచారించారు. విదేశీ పర్యటనలు, షాహీన్‌బాగ్ నిరసనలు, రైతుల ఉద్యమం తదితరాలపై 25 ప్రశ్నలను వారందరి ముందుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. వారి మొబైళ్లు, లాప్‌టాప్‌లు, కంప్యూటర్ల హార్డ్‌డిస్కులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆరు గంటలకు పైగా వారిని విచారించారు. వెబ్‌సైట్ వ్యవస్థాపకుడైన ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పురకాయస్థను, అమిత్ చక్రవర్తి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణను ఎదుర్కొన్నవారిలో చరిత్రకారుడు సొహైల్ హష్మీ ఉన్నారు.
దర్యాప్తు సంస్థలకు స్వతంత్రత ఉంది: కేంద్రం
దాడులపై కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ స్పందిస్తూ.. దేశంలో దర్యాప్తు సంస్థలకు స్వతంత్రత ఉందని, అవి చట్ట ప్రకారం పనిచేస్తాయని చెప్పారు. ‘ఎవరైనా తప్పుచేస్తే దానిపై దర్యాప్తు సంస్థలు దృష్టి కేంద్రీకరిస్తాయి. అక్రమ పద్ధతుల్లో ఎవరికైనా డబ్బు అందితే విచారణ జరపకూడదని ఎక్కడా రాసిలేదు’ అని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అత్యయిక పరిస్థితిని విధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పత్రికాస్వేచ్ఛ కోసం నీతులు చెప్పాల్సిన అవసరం లేదని భాజపా జాతీయ అధికార ప్రతినిధి షెహ్‌జాద్ పూనావాలా అన్నారు.
న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి రూ.కోట్ల నిధులు అందుతున్నాయంటూ ఈ ఏడాది ఆగస్టులో అమెరికా పత్రికలు కథనాలు ప్రచురించాయి. అమెరికా కోటీశ్వరుడు నెవిల్లే రాయ్ సింగం, ఆయనకు చెందిన న్యూస్ క్లిక్.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రమాదకరమైన సాధనాలని పేర్కొన్నాయి. ఇటీవల దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదుచేసి సోదాలు నిర్వహించింది. కొన్ని ఆస్తులను జప్తు చేసింది. ఈడీ సమాచారంతో ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.




