
వైశాఖ శుద్ధ తృతీయ రోజు రాత్రి మొదటిజాములో పునర్వసు నక్షత్రంలో ఆరుగ్రహాలు ఉచ్చ స్థితి లో ఉండగా రాహువు మిథునంలోనున్న సమయంలో రేణుకాగర్భం నుండి ‘ హరి ‘ పరశురాముడుగా అవతరించినట్లు స్కాంద, భవిష్య పురాణాల్లో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించిన ఈ రోజు శ్రీ మహా విష్ణువును పూజించడంతో పాటూ విష్ణు సహస్రనామ పారయణము, వైష్ణవ ఆలయాలను దర్శించడం విశేషం.
సింహాచలం చందనోత్సవం….
సింహాచలం లో నరసింహ స్వామి వారికి చందనోత్సవం ఈ రోజే ! ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. ఇంకా “అక్షయ తృతీయ” నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.
అక్షయ తృతీయ
జీవితంలో అన్నిటిని అక్షయం చేసే రోజు కనుక దీనికి “అక్షయ తృతీయ ” అని పేరు. కృతయుగం ప్రారంభమైన రోజు ఈ దినమేఅని విష్ణుపురాణ కధనం. ఈ రోజున ఇష్ట దేవతలను,లక్ష్మి దేవిని పూజించి గోధుములు,శనగలు ,దధ్యొదనాలల్తో పాటు శక్తి ఉన్నవారు పాదురక్షలు ,గొడుగు వస్త్రాలను దానం చెయ్యటం మంచిది. ఈ రోజు ఎది అయితే దానం చేస్తామో,అవి తమ జీవితంలో అక్షయమవుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి.





