News

నేటి నుండి ఉత్సవాలు

219views

త్రిపురాంతకం పల్నాటి బ్రహ్మనాయుడు పేరు వినగానే పల్నాటి యుద్దం గుర్తుకొస్తుంది. పగలు, ప్రతీకారాలు, కోడి పందేలు మదిలో మెదలవుతాయి. నాగమ్మతో కోడిపందెంలో ఓడిన తరువాత బ్రహ్మనాయుడు పల్నాటి సీమను వదిలిన తరువాత నివసించిన గ్రామమే మేడపి. కోడిపందెంలో ఓడిన తరువాత బ్రహ్మనాయుడు రాజనీతిని పాటిస్తూ రాజ్యాన్ని వీడాడు. అనంతరం శ్రీశైల మల్లికార్జునుడిని కొంతకాలం సేవించాడు. తరువాత మార్కాపురం వచ్చి లక్ష్మీచెన్నకేశవ స్వామిని సందర్శించారని ప్రతీతి. చివరిగా మేడపి చేరి శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తుండగా త్రిపురాంతకేశ్వర స్వామి ప్రత్యక్షమై ఆలయ గోపుర శిఖరం నీడపడే తూర్పు భాగాన నివసించమని బ్రహ్మనాయుడుని ఆదేశించి నట్లు చరిత్ర చెబుతోంది. దీంతో బ్రహ్మనాయుడు ఆలయ గోపురనీడ చివరి భాగంలో ఉన్న మేడిచెట్లను నరికి నివాసం ఏర్పాటు చేసుకున్నందున ఆ గ్రామానికి మేడపిగా పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. తనకు ఇష్టమైన చెన్నకేశవస్వామిని ప్రతిష్టించి గుడిని నిర్మించారు. అంకాలమ్మ గుడిని నిర్మించారు. అక్కడే యువకులకు యుద్దంలో శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆలయ సమీపంలో వీరులకు ప్రతీకగా నిర్మించిన ఒక దేవాలయం ఉంది. దీనినే వీరుల గుడి అని పిలుస్తారు.

బాలచంద్రుడు బొంగరాలాట

బ్రహ్మనాయుడు ముద్దుల కొడుకు బాల చంద్రుడు. యుద్దకళల్లో ఆరితేరిన బాల చంద్రుడినికి స్నేహితులు ఎక్కువ. మేడపి గ్రామానికి చెందిన కన్నమదాసు, అనపోతరాజు, చాకలి చందు, మంగళి మల్లు అనే స్నేహితులు ఉన్నట్లు చరిత్రలో ఉంది. బాలచంద్రుడు మాంచాల అనే యువతిని వివాహమాడాడు. బొంగారాలు ఆట అంటే అమితంగా ఇష్టపడే బాలచంద్రుడు ఓ బావి ఒడ్డున నిత్యం బొంగారాలు ఆట ఆడేవాడు. దీంతో ఆ బావిని బొంగరాల బావి అని ఆ ప్రాంతాన్ని బొంగరాల గడ్డ అని పిలుస్తుంటారు.

నేటి నుండి ఉత్సవాలు

ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు 5 రోజులపాటు గ్రామంలో ఉత్సవాలను అంగరం గ వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలలో భాగంగా 19న సాయంత్రం చెన్నకేశవ స్వామి కల్యాణం నిర్వహించారు. 20న రాచగావు, 21న రాయభారం, 22న కోడిపోరు, 23న దీవెన బండారు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 20, 21, 22, 23 తేదీలలో రాత్రిపూట మేడపి గ్రామంలో దైవాల ఊరేగింపు కనుల పండువగా నిర్వహిస్తారు.