
* భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ ఏ ఐ) గిన్నిస్ ప్రపంచ రికార్డ్
ఓ రోడ్డు నిర్మాణాన్ని అత్యంత వేగవంతంగా పూర్తిచేసి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ ఏ ఐ) గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. మహారాష్ట్రలో అమరావతి – అకోలా జిల్లాల మధ్య 75 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై తారురోడ్డు (సింగిల్ లేన్) నిర్మాణాన్ని నిరంతరాయంగా 105 గంటల 33 నిమిషాల్లోనే పూర్తిచేశారు. ఈమేరకు ప్రపంచ రికార్డు సాధించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. 720 మంది పగలూ రాత్రీ శ్రమించి ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు చెప్పారు.
ఈనెల 3వ తేదీన ఉదయం 7.27 గంటలకు పనులు ప్రారంభం కాగా 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పూర్తయినట్లు మంత్రి తెలిపారు. అత్యంత వేగవంతంగా తారురోడ్డు నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు గిన్నిస్ ప్రపంచరికార్డు దోహా (ఖతార్)లో 2019 ఫిబ్రవరిలో చేపట్టిన ఓ రహదారి పేరిట ఉండేది. అక్కడ 25.275 కిలోమీటర్ల రోడ్డును 10 రోజుల్లో పూర్తిచేసినట్లు మంత్రి వెల్లడించారు. తాజాగా మహారాష్ట్రలో నిర్మించిన రోడ్డు 53వ జాతీయ రహదారిలో భాగంగా ఉంది. కోల్‌కతా, రాయ్ పూర్, నాగపూర్, సూరత్ వంటి ప్రధాన నగరాలను కలిపే ఈ రహదారి ‘తూర్పు -తూర్పు నడవా’ (ఈస్ట్ - ఈస్ట్ కారిడార్)లో కీలకమైన మార్గం. ఈ రోడ్డు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, కార్మికులు, తదితరులందరికీ మంత్రి అభినందనలు తెలిపారు.




