News

కన్నుల పండువగా బాల మేళా – 2019.

706views

విజ్ఞాన ప్రదర్శన:

17/2/2019 ఆదివారం విజయవాడ మోఘల్రాజపురంలోని సిద్దార్థ అకాడమి ఆడిటోరియంలో “సేవా భారతి” అధ్వర్యంలో జరిగిన “ బాల మేళా – 2019” సందర్భంగా విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. సేవా భారతి నిర్వహించు అభ్యాసికల[ఉచిత బోధనా తరగతుల]లో శిక్షణ పొందే చిన్నారులు స్వయంగా రూపొందించిన వివిధ రకాలయిన వైజ్ఞానిక కళాకృతుల ప్రదర్శన ఏర్పాటు చెయ్యబడినది.

ఈ కార్యక్రమానికి విజయవాడ ఐరన్ అండ్ హార్డ్ వేర్ మర్చంట్స్ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి శ్రీ చల్లా జనార్ధన్, ట్విల్స్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ జీ. ఎస్ నవీన్, మైక్రోసాఫ్ట్ గ్రూప్ ఇంజనీరింగ్ మేనేజర్ శ్రీ కనిగిచర్ల అనంతకుమార్ లు పాల్గొని ప్రదర్శనను ప్రారంభించారు. సందర్శకులు చిన్నారుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.

 

సభా కార్యక్రమం:

అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో మాజీ TTD పాలకమండలి సభ్యురాలు శ్రీమతి డా|| చదలవాడ సుధ, N.R.I అకాడెమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షులు డా|| ముక్కామల అప్పారావు, ఫ్యూచర్ ఆల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ చింతా రవికుమార్ లు విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు.

శ్రీమతి డా|| చదలవాడ సుధ మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు అడుగంటిపోతున్న ఈ రోజులలో పిల్లలలో ఉత్తమ సంస్కారాలను, దేశభక్తిని, క్రమశిక్షణను, సృజనాత్మకతను పెంపొందిస్తున్న “ సేవా భారతి” కృషి అభినందనీయమని కొనియాడారు.

డా|| ముక్కామల అప్పారావు మాట్లాడుతూ విజ్ఞాన ప్రదర్శనలోని ఎగ్జిబిట్స్ ను చూసి చిన్నారుల ప్రతిభకు ముగ్దుడనయ్యానని చెప్పారు. సేవా భారతి ఈ విధంగా చిన్నారుల ప్రతిభను వెలికి తీస్తూ వుండడం అభినందనీయమని తెలిపారు.

శ్రీ చింతా రవికుమార్ మాట్లాడుతూ మాతృ దేవోభవ, పితృ దేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అన్న పవిత్ర భావనను పిల్లలకు నేర్పాలని, చిన్న వయసులో తగిన సంస్కారాలనందిస్తే పెద్దయ్యాక పిల్లలు ప్రయోజకులవుతారని, తల్లిదండ్రులకు, గురువులకు, దేశానికి మంచి పేరు తెస్తారని, పిల్లలలో అలాంటి సంస్కారాలను నింపడమే ధ్యేయంగా కృషి చేస్తున్న “సేవా భారతి” కార్యకలాపాలకు అందరూ చేయూతనివ్వాలని తెలిపారు.

పాలలో దాగిన నెయ్యిలా పిల్లల్లో సంస్కారాలు, ప్రతిభ, సృజనాత్మకత దాగి వుంటాయి : ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీరాం భరత్ కుమార్ :

ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీరాం భరత్ కుమార్ మాట్లాడుతూ పాలలో నెయ్యి దాగి ఉన్నట్లుగా పిల్లలలో ఉత్తమ సంస్కారాలు, ప్రతిభ, సృజనాత్మకత దాగి ఉంటాయని, పాలు కాచి, చల్లార్చి, తోడు పెట్టి, చిలికి, వెన్నతీసి నెయ్యి చేసినట్లుగా పిల్లలచే సాధన చేయించడం ద్వారానే వారిలోని సద్గుణాలు, సృజనాత్మకత వెలికి వస్తాయని తెలిపారు.

నూతనంగా వివాహమై కాళ్ళ పారాణి ఆరకముందే సైనికుడైన తన భర్తకు వీర తిలకం దిద్ది రణ భూమికి పంపే, యుద్ధం జరుగుతున్న సమయంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమారునికి వీర తిలకం దిద్ది శత్రువుకి ఎదురు పంపే, ఒక బిడ్డ యుద్దంలో మరణిస్తే రెండవ బిడ్డను కూడా యుద్ద భూమికి పంపే వీర నారీ మణులు నేటికీ మన దేశంలో వున్నారని, అదే ఈ పుణ్య భూమి గొప్పతనమని తెలిపారు.

తను పెద్దవాడినయితే జట్కా బండి నడిపేవాడినవుతానని చెప్పిన బాల వివేకానందుని తల్లి “ నువ్వు యావత్సమాజానికీ మార్గ దర్శనం చేసే, ధర్మ రక్షణ చేసే శ్రీ కృష్ణుని వంటి రథ సారధివి కావాలి నాయనా” అని దిశాదర్శనం చేసిందని తెలిపారు. వ్యక్తిని తీర్చిదిద్దితే, వ్యక్తులను కలిపితే దేశం సహజంగానే సమగ్రతను సాధిస్తుందన్నదే సేవా భారతి, ఆరెస్సెస్ ల విశ్వాసమని తెలిపారు. అందుకే చిన్నారులకు సరయిన దిశను చూపడం ద్వారా సాధారణ బాలకులను సైతం అసామాన్యమైన వ్యక్తులుగా, దేశభక్తులుగా తీర్చి దిద్దే కార్యాన్ని సేవా భారతి చేస్తున్నదని తెలిపారు. ఇలాంటి కార్యానికి కేవలం ధన సహాయం మాత్రమే చేస్తే సరిపోదని అందరూ తమ విలువైన సమయాన్ని సమర్పించడం ద్వారా సేవా భారతి కార్యక్రమాల విస్తృతికి దోహదపడాలని కోరారు. సేవా భారతి రాష్ట్రం మొత్తం మీద పదకొండు వందల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు.అనంతరం వివిధ అంశాలలో ప్రతిభ కనబరచిన అభ్యాసిక ప్రముఖ్ లు, చిన్నారుల తల్లులకు ముఖ్య అతిధులు బహుమతి ప్రదానం చేశారు.  చివరిగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.