News

వేద పండితులకు నియామక పత్రాలు

7views

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన వేద పండితులకు నిడదవోలులోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ నియామక పత్రాలను అందజేశారు. తితిదే నిర్వహించిన వేద పారాయణ స్కీమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 741 మంది వేద పండితులను ఎంపిక చేయగా నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు చెందిన కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేద నిష్ణాతులైన 10 మంది పండితులు ఈ నియామక పత్రాలను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం పురోహిత, అర్చక, దేవాలయ వ్యవస్థల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పండితులు పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో విచ్చేసే లక్షలాది మంది భక్తులకు పూజా కార్యక్రమాలు, పిండ ప్రదానాలు నిర్వహించేందుకు నిడదవోలు పరిసర ప్రాంతాలలోని 80 గ్రామాల పురోహితులకు తగిన వసతి, ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలని పండితులు మంత్రి దుర్గేష్‌కు విన్నవించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటికే అనేక పురాతన ఆలయాల నిర్మాణానికి, పునరుద్ధరణకు భారీగా నిధులు మంజూరు చేశామని గుర్తుచేశారు. పుష్కరాల సందర్భంగా పురోహితులకు అవసరమైన వసతి షెడ్ల ఏర్పాటుపై సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.