News

ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’ : అమిత్ షా

2views

దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. 2029లోగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాల్లో యూసీసీ అమలు చేస్తామని ఆయన అన్నారు. ముంబైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత అంశాలకు ఒకే రకమైన చట్టపరమైన నిబంధనలు వర్తింపచేయాలనే ఉద్దేశంతో బీజేపీ ‘‘ఉమ్మడి పౌరస్మృతి’’ని తీసుకువస్తోంది.

ఇప్పటికే పలు బీజేపీ రాష్ట్రాలు యూసీసీ చట్టాలు చేశాయి. మిగిలిన ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో కూడా దీనిని తీసుకువస్తామని అమిత్ షా ప్రకటించారు. దేశ భద్రతను ప్రస్తావిస్తూ.. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదంపై బీజేపీ ప్రభుత్వం ‘‘జీరో టాలరెన్స్’’ విధానాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లో భద్రతకు అధిక ప్రధానత్య ఇస్తున్నట్లు చెప్పారు. అక్రమ వలసదారుల్ని గుర్తించి, ఏరివేస్తామని చెప్పారు.