
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని రోడ్డు కమ్ రైలు వంతెనపై నుంచి పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
నూకరాజు, ఆయన భార్య, కుమార్తె, మనవడు గోదావరిలోకి దూకినట్లు సమాచారం. ఈత రావడంతో నూకరాజు మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నూకరాజు, ఆయన భార్య, కుమార్తె ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
నూకరాజు ప్రస్తుతం పిఠాపురంలో పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ లెటర్‌లో వేధింపుల ఆరోపణలు
కాకినాడ రైఫిల్ షూటింగ్ ఆర్గనైజర్ షేక్ సాధిక్ ఖాన్ వేధింపుల కారణంగానే తమ కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నూకరాజు రాసినట్లు చెబుతున్న సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
తన అల్లుడు ఈ ఏడాది జులైలో మరణించిన అనంతరం తన కుమార్తెను షేక్ సాధిక్ ఖాన్ వేధిస్తున్నాడని లేఖలో ఆరోపించినట్లు తెలుస్తోంది. తన కుమార్తె, మనవడికి ఆ వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు నూకరాజు లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల ఆచూకీపై అధికారికంగా మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.





