News

పుత్తూరులో మహాభారత బ్రహ్మోత్సవాలు..

28views

చిత్తూరు జిల్లా పుత్తూరులోని ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజుల ఆలయంలో మహాభారత బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 14 నుంచి 24వ తేదీ వరకు 11 రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలకు పుత్తూరుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.

పుత్తూరు పట్టణానికి వచ్చే వారు ధర్మరాజుల ఆలయాన్ని దర్శించకుండా తిరిగి వెళ్లరనే విశ్వాసం స్థానికుల్లో ఉంది. దక్షిణ భారతదేశంలో పాండవులకు రథం ఉన్న ఏకైక ఆలయంగా ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏటా శ్రావణ మాసంలో నిర్వహించే మహాభారత బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ వాహన సేవలు, రథోత్సవం, అగ్నిగుండ ప్రవేశం వంటి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటాయి.

బావి తవ్వుతుండగా అమ్మవారి విగ్రహం
ఈ ఆలయానికి సంబంధించి స్థానికంగా ప్రచారంలో ఉన్న చారిత్రక కథనం ఆసక్తికరంగా ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం పతనం అనంతరం దక్షిణ భారత ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితులు మారిన సమయంలో తమిళనాడులోని చెంగలపట్టు ప్రాంతం నుంచి పలువురు పుత్తూరుకు వలస వచ్చినట్లు చెబుతారు.

వారిలో ఏడుగురు అన్నదమ్ములు చౌటూరులో బావి తవ్వే పనిని చేపట్టగా, తవ్వకాల్లో అమ్మవారి చెక్క బొమ్మ లభించిందని స్థానిక కథనం. అప్పటి నుంచి వారు ఆ బొమ్మకు పూజలు చేయడం ప్రారంభించారు. వారిలో ఒకరు అమ్మవారికి ఆలయం నిర్మించాలనే సంకల్పంతో విరాళాల సేకరణకు పూనుకున్నారని చెబుతారు.

ఈ విషయం తెలుసుకున్న కార్వేటినగరం సాల్వరాజు ఆయనను పరీక్షించారని, పరీక్షలో విజయం సాధించిన అనంతరం ఆలయం నిర్మించాలనే ఆయన కోరికను రాజు నెరవేర్చారని స్థానిక చరిత్ర పేర్కొంటుంది. ఆయన ఆధ్వర్యంలో ఆలయం, ప్రాకారం, గాలిగోపురం నిర్మాణం జరిగిందని చెబుతారు.

40 అడుగుల ద్రౌపదీ దేవి విగ్రహం
ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజుల ఆలయానికి ఉన్న భారీ రథం ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ. స్థానిక ప్రజలు గతంలో చందాలు సేకరించి సుమారు 40 అడుగుల ఎత్తులో రథాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ వర్గాలు చెబుతున్నాయి. కాలక్రమంలో రథం పాడవడంతో సుమారు 20 ఏళ్ల క్రితం పుత్తూరు కమ్మ సంఘం నాయకులు దానిని పునరుద్ధరించారు. అప్పటి నుంచి సంప్రదాయబద్ధంగా రథోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం

ఆగస్టు 14న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలు ఇలా ఉన్నాయి:

ఆగస్టు 14: ధ్వజారోహణం
ఆగస్టు 15: పులివాహనం
ఆగస్టు 16: యాళి వాహనం
ఆగస్టు 17: శేషవాహనం
ఆగస్టు 18: అశ్వవాహనం
ఆగస్టు 19: గజవాహనం
ఆగస్టు 20: హంస, సింహ వాహన సేవలు
ఆగస్టు 21: వరలక్ష్మీ వ్రతం, అర్జున తపస్సు, అలుగు ఉత్సవం
ఆగస్టు 22: మహా రథోత్సవం
ఆగస్టు 23: అగ్నిగుండ ప్రవేశం
ఆగస్టు 24: ధ్వజావరోహణం

ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో సీఐ నెట్టి కంఠయ్య, ఎస్‌ఐ నాగేంద్రబాబు, పోలీసు సిబ్బంది పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

మహాభారత గాథలు, పాండవుల ఆరాధన, సంప్రదాయ వాహన సేవలు, భారీ రథోత్సవంతో పుత్తూరులో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరగనున్నాయి.