
జ్వాలాపూర్: వయసు 80 ఏళ్లు.. శ్వాసకోస సంబంధిత అనారోగ్యం.. వైద్యులు యాత్రకు వెళ్లొద్దని సూచించారు. అయినా శివుడిపై ఉన్న అచంచల భక్తి ముందు ఆరోగ్య సమస్యలను సైతం లెక్కచేయలేదు ఓ వృద్ధ భక్తుడు. ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో సుమారు 93 కిలోమీటర్లు ప్రయాణించి కన్వర్ యాత్రను పూర్తి చేశారు.
ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్‌కు చెందిన పరశురామ్ శర్మకు కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కన్వర్ యాత్ర చేయడం కష్టమని వైద్యులు సూచించారు. అయితే పరమశివుడిపై తనకున్న భక్తితో యాత్ర చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
పరశురామ్ శర్మ తన స్కూటీ వెనుక రెండు ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసుకుని జ్వాలాపూర్ నుంచి యాత్రను ప్రారంభించారు. సుమారు 93 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌లో ఉన్న శివ చౌక్‌కు చేరుకున్నారు.ప్రయాణంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైన ప్రతిసారీ ఆక్సిజన్ సిలిండర్ సాయంతో ఉపశమనం పొందుతూ ముందుకు సాగారు. అనారోగ్యం తన సంకల్పానికి అడ్డంకి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ యాత్రను కొనసాగించారు.
ముజఫ్ఫర్‌నగర్‌లోని శివ చౌక్ చేరుకున్న అనంతరం పరశురామ్ శర్మ పరమశివుడికి జలాభిషేకం చేసి తన కన్వర్ యాత్రను పూర్తి చేశారు.
మొదట బాగ్‌పత్‌లోని పురా మహాదేవ్ ఆలయం వరకు వెళ్లాలని ఆయన భావించారు. అయితే ఆ ప్రాంతం ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లను అక్కడికి తీసుకెళ్లడం కష్టమవుతుందని భావించి తన ప్రయాణాన్ని ముజఫ్ఫర్‌నగర్‌లోనే ముగించాలని నిర్ణయించుకున్నారు.పరశురామ్ శర్మకు కన్వర్ యాత్ర కొత్తేమీ కాదు. ఇప్పటివరకు ఆయన 13 సార్లు కన్వర్ యాత్ర పూర్తి చేసినట్లు తెలిపారు.
“వయసు, అనారోగ్యం నా భక్తికి అడ్డంకులు కావు. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా శివుడే నాకు ధైర్యం ఇస్తాడు” అనే భావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ తన ఇష్టదైవమైన శివుడిపై ఉన్న విశ్వాసంతో యాత్రను పూర్తి చేసిన పరశురామ్ శర్మను చూసి స్థానికులు, భక్తులు అభినందిస్తున్నారు. “భక్తికి వయసుతో సంబంధం లేదు.. మనసులోని విశ్వాసం, సంకల్పమే ప్రధానమని” ఆయన యాత్ర మరోసారి చాటి చెబుతోంది.





