News

భారత్‌లో యువతను రెచ్చగొడుతున్న ఆకిబ్‌కు ఏటీఎస్‌ గ్లోబల్ అలర్ట్ జారీ

72views

దుబాయ్‌లో ఉన్న ఐసిస్ మాస్టర్‌మైండ్ ఆకిబ్‌పై ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గ్లోబల్ అలర్ట్ జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గాలింపు చర్యలను ప్రారంభించింది. భారత్‌లో ఇటీవల బహిర్గతమైన ఐసిస్ టెర్రర్ మాడ్యూల్ వెనుక ప్రధాన సూత్రధారి అతడేనన్న అనుమానాలు ఉన్నాయి.

ఉగ్రవాద కార్యకలాపాల కోసం స్థానికంగా నియమితులైన వ్యక్తులు, పాకిస్థాన్ హ్యాండ్లర్ల మధ్య ఆకిబ్ కీలక పాత్ర పోషించాడు. సఖిబ్ అలియాస్ “డెవిల్”, అర్బాబ్, లోకేష్‌, వికాస్ అనే నలుగురిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ విచారణ కొనసాగుతోంది. వీరు ఢిల్లీ, ముంబై, హరియాణాలో దాడులకు ప్రణాళిక వేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆకిబ్‌పై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది.

సఖిబ్ అలియాస్ “డెవిల్” నేతృత్వంలోని మాడ్యూల్‌ను ఈ నెల ప్రారంభంలో ఏటీఎస్ బహిర్గతం చేసింది. సఖిబ్‌తో పాటు అర్బాబ్, లోకేష్, వికాస్‌ విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాలతో దేశ వ్యతిరేక చర్యలకు కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఉన్నాయి.

విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సఖిబ్‌ను పాకిస్థాన్ హ్యాండ్లర్లతో కలపడంలో ఆకిబ్ కీలక పాత్ర పోషించాడు. తర్వాత సఖిబ్ స్థానిక స్థాయిలో నెట్‌వర్క్ ప్రారంభించి, యువకులను చేర్చుతూ ఉగ్రవాద ప్రచారాన్ని వ్యాప్తి చేశాడు.