News

విజయ దశమి పర్వదినం రోజునే 80 శాతం ఉత్సవాలు : హోసబళే

194views

సంఘ కార్యశతాబ్ది విజయ దశమిని పురస్కరించుకొని నాగపూర్ తో పాటు దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయని, అవన్నీ కూడా విజయవంతం అయ్యాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే తెలిపారు. సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని మత, సాహిత్య, కళాత్మక, పారిశ్రామిక రంగాలతో పాటు పలు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు కూడా తెలిపారన్నారు.

జబల్ పూర్ కేంద్రంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ మూడు రోజుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే మీడియాతో మాట్లాడారు.

సంఘ్ వందేళ్ల ప్రయాణంలో లక్షలాది మంది స్వయంసేవకులతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు కూడా సంఘ్ కి మద్దతిచ్చారని, వారందరికీ ధన్యవాదాలు ప్రకటిస్తున్నామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లోని 59,343 మండలాలకు గాను 37,250 మండలాల్లో సంఘ కార్య శతాబ్ది విజయ దశమి ఉత్సవాలు జరిగాయని, ఇందులో చుట్టు పక్కల మండలాలకు సంబంధించిన స్వయంసేవకులు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఇలా 50,096 మండలాలకు ప్రాతినిధ్యం లభించిందనక్నారు. అలాగే పట్టణ ప్రాంతాలలో 44,686 ప్రాంతాలకు గాను 40,220 ప్రాంతాలలో కార్యక్రమాలు జరిగాయన్నారు. అంతేకాకుండా 6,700 విజయదశమి ఉత్సవాలు జరిగాయని మొత్తంగా చూసుకుంటే 62,555 విజయ దశమి ఉత్సవాలు జరిగాయని ప్రకటించారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే విజయ దశమి పర్వదినం రోజునే 80 శాతం ఉత్సవాలు జరిగాయని, అయితే.. స్థానిక కారణాలు, పరిస్థితుల దృష్ట్యా కొన్ని చోట్ల ఒక రోజు అటూ ఇటూగా జరిగాయని తెలిపారు.

దేశ వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో 32,45,141 మంది స్వయంసేవకులు పూర్ణ గణవేష (సంఘ యూనిఫాం) లో పాల్గొన్నారని హోసబళే పేర్కొన్నారు. అలాగే కొన్ని చోట్ల పథ సంచలన్ లు కూడా జరిగాయని, దేశ వ్యాప్తంగా 25 వేల ప్రదేశాలలో పథ సంచలన్ లు జరిగాయన్నారు. ఇందులో 25,45,800 మంది స్వయంసేవకులు పాల్గొన్నారని ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ సంఘ విజయ దశమి ఉత్సవాలు జరిగాయని, అలాగే సంఘ కార్యక్రమాల విస్తరణ కూడా జరిగిందన్నారు. అండమాన్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్, మేఘాలయ, నాగాలాండ్ లో కూడా ఉత్సవాలు జరిగాయన్నారు.

ఈ సంఘ కార్య శతాబ్ది విజయ దశమి ఉత్సవాలకి సమాజంలోని వివిధ రంగా ప్రముఖులు, వివిధ రకాల వ్యక్తులు పరిపూర్ణంగా సహకరించి, అందులో పాల్గొన్నారన్నారు. అలాగే నాగపూర్ కేంద్రంగా జరిగిన కార్యక్రమానికి విదేశీ అతిథులు కూడా హాజరయ్యారన్నారు. అలాగే సరసంఘచాలక్ తో పాటు మరికొంత మంది ఆరెస్సెస్ అధికారులతో కూడా కలుసుకున్నారని, వారు సంఘ్ గురించి అవగాహన చేసుకొని, శుభాకాంక్షలు కూడా తెలిపారన్నారు.

గత యేడాది అక్టోబర్ లో జరిగిన సమావేశాలతో పోలిస్తే.. ఈ అక్టోబర్ నాటికి 10,000 కొత్త ప్రదేశాలలో సంఘ కార్యం ప్రారంభమైందని ప్రకటించారు. ప్రస్తుతం 55,052 ప్రదేశాలలో 87,398 శాఖలు నడుస్తున్నాయని, ఇది గత యేడాది కంటే 15,000 ఎక్కువ అని తెలిపారు.ఇవే కాకుండా వారికి (సాప్తాహిక్) 32362 శాఖలు నడుస్తున్నాయని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా జరిగిన విశేష ప్రయత్నాల కారణంగా సంఘకార్యం గిరిజన ప్రాంతాలలోనే కాకుండా కార్మికులు, విద్యార్థులు, వ్యాపారవేత్తల రంగాలలో కూడా విశేషంగా విస్తరించిందన్నారు.