ArticlesNews

సర్వమత సారమే విశ్వ నిర్మల ధర్మం

249views

( జనవరి 19 – విశ్వ నిర్మల ధర్మ సంస్థాపన దినోత్సవం )

  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహజయోగులు ప్రతి ఏటా జనవరి 19వ తేదీని ‘విశ్వ నిర్మల ధర్మ సంస్థాపన దినోత్సవం’గా జరుపుకొంటారు.
  • ‘ధర్మమే సర్వ జగత్తుకు ఆధారం’ అని ‘నారాయణ ఉపనిషతు’ చెబుతోంది. ‘దైర్యం, క్షమ, సంయమనం, అస్తేయం (దొంగతనం చెయ్యకపోవడం), శౌచం, ఇంద్రియ నిగ్రహం, విద్య, సత్యం, క్రోధరాహిత్యం, సంశయం లేకుండా ఉండడం… ఈ పది జీవితంలో పాటించడమే ధర్మం’ అని ‘మనుస్మృతి’ చెబుతోంది. మాతాజీ నిర్మలాదేవి ప్రవేశపెట్టిన ‘విశ్వ నిర్మల ధర్మాని’కి ఈ సూత్రమే పునాది. ‘విశ్వ’ అంటే విశ్వజనీనమైనది. ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని కుల, మత, వర్గ, ప్రాంత, లింగ, వయో భేదాలు లేకుండా ఆచరించవచ్చు. ‘నిర్మల’ అంటే ‘ఎలాంటి మలినం లేనిది, పరిపూర్ణమైన స్వచ్ఛత కలిగినది’ అని అర్థం. మనిషి ధర్మబద్ధమైన జీవితంతో మనసును శుద్ధి చేసుకోవాలని ప్రాచీన కాలం నుంచి అన్ని మతాలు చెబుతున్నాయి. సాధకుడి ఆధ్యాత్మిక ఉత్థానానికి మార్గాన్ని సుగమం చేసి, జీవితంలో అన్ని విధాలా సమతుల్యతను నెలకొల్పడమే ప్రతి మతం తాలూకు లక్ష్యం. అన్ని మతాల మధ్యా సామరస్యాన్ని తీసుకువచ్చి, వాటి నిజమైన అర్థాన్ని బోధించి, అవన్నీ ఒకే వృక్షానికి పూసిన పూవులని నిరూపించేవారు ఒకరు ఉండాలి. ఆ పని కోసమే భగవంతుడు పంపినట్టు మాతాజీ నిర్మలాదేవి జన్మించారు.

    అప్పుడే మనది వసుధైక కుటుంబం
    సహజయోగం ఏ మతానికో చెందినది కాదు. ఇది సర్వ మత సమ్మేళనం, సర్వ మతాల సారం. అవతార పురుషులు, సద్గురువులు, మత ప్రవక్తల ప్రబోధాల సారాంశాన్ని సమ్మిళితం చేసి ఆచరిస్తున్న ధార్మిక సంగమం. అన్ని మతాలు వాటిని ప్రారంభించిన అవతారమూర్తుల పేరుతో ప్రసిద్ధి చెందాయి. అదే విధంగా ఈ ఆధ్యాత్మిక మార్గం కూడా శ్రీమాతాజీ నిర్మలాదేవి పేరిట ‘విశ్వ నిర్మల ధర్మం’గా ఏర్పడింది. సహజ యోగులు దీన్ని ఆచరిస్తారు. ఇది అన్ని మతాల సారాంశం. ఇందులో అన్ని మతాల నిజమైన అర్థాన్ని, వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకుంటాం. ‘విశ్వ నిర్మల ధర్మం’ అనే మాట వినగానే ‘కొత్త మతం తీసుకోవాలేమో? సహజయోగ సాధన చేయాలంటే మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, నియమ నిష్టలు అనుసరించాలేమో?’ అనే అపోహ మొదట్లో కొందరికి కలుగుతుంది. కానీ ఇందులో ప్రత్యేకంగా పాటించే నియమం ఏదీ లేదు. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడే మార్గం మాత్రమే. మన అందరిదీ ఒకే మతం, ఒకే రంగు, ఒకే జాతి కాకపోవచ్చు… కానీ అందరినీ సృష్టించిన ఆది దంపతులు ఒక్కరే. ఇది అంగీకరిస్తే అందరిదీ ఒకే మతం. ఒకే అభిమతం, ఒకే కుటుంబం. అదే విశ్వ నిర్మల ధర్మం చెబుతోంది. దీన్ని అర్థం చేసుకోవడానికి, ఆచరించి చూపడానికి సహజయోగ సాధనే సాధనం. దీన్ని అనుసరించినప్పుడు మన ప్రపంచం భూతల స్వర్గం, వసుధైక కుటుంబం అవుతుంది.

    మానవ జన్మకు పరమార్థం
    సహజ యోగ సాధకులు… హిందూ దేవతలను, అల్లాహ్‌ను, క్రీస్తును, బుద్ధుణ్ణి, మహావీరుణ్ణి, గురునానక్‌ను ఆయా పర్వదినాలలో ఆరాధిస్తారు. అందరూ ఒక్కటే అనే భావనతో మెలుగుతారు. ‘.నిన్ను నీవు తెలుసుకో… అనేది అన్ని మతాల సారాంశం. అదే సత్యం. భగవంతుడు ఎక్కడో లేడు. నీ ఆత్మలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆత్మ స్వరూపుడిగా పరిణామం చెందాలి. ఎన్నో ఏళ్ళ, జన్మల ఈ సత్యాన్వేషణ… సహజ యోగంలో ఆత్మ సాక్షాత్కారంతో ముగుస్తుంది అదే మానవ జన్మకు పరమార్థం’’ అంటారు శ్రీమాతాజీ నిర్మలాదేవి. ఆమె కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు. సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని, సర్వమత, సర్వ ధర్మ సంస్థాపనను కేవలం ప్రచారానికో, ప్రవచనాలకో పరిమితం కాకుండా మనసా, వాచా, కర్మణా ఆచరించి చూపించారు. అలా చేయగలిగే అవకాశం సహజయోగంలోనే ఉందని చాటిచెప్పారు. అదే విశ్వ నిర్మల ధర్మం.