
నెల్లూరు నగరపాలక సంస్థ కార్మికురాలిగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు వనపర్తి జయమ్మకు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆమెకు ఆహ్వాన పత్రిక అందింది. ఈ మేరకు ఈ ఆహ్వాన పత్రికను నెల్లూరు నగరపాలక కమిషనర్ సూర్యతేజ జయమ్మకు అందించారు. కమిషనర్ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్ఎస్ కేఎఫ్ఎసీ పథకం లబ్ధిదారునిగా జయమ్మ సెప్టిక్ ట్యాంక్ వాహనానికి యజమానిగా ఉంటూ స్వయంకృషితో విధులు నిర్వహించడాన్ని, సాటి పారిశుధ్య కార్మికులకు ఆదర్శంగా నిలవటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని కల్పించిందని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొనే గొప్ప అవకాశాన్ని నెల్లూరు నగరపాలక సం స్థ కార్మికురాలు జయమ్మ పొందడం ఆదర్శనీయమని ఆయన అభినందించారు.
రూ. 32 లక్షలతో అత్యాధునిక వాహనం
జయమ్మకు రూ.32 లక్షల విలువైన వాహనం కేటాయించారు. రూ. పది లక్షల రాయితీ కల్పించారు. మిగిలిన మొత్తం వాయిదాల పద్ధతిలో ప్రతి నెలా రూ. 27వేల చొప్పున 84 నెలలు చెల్లించేలా అవకాశం కల్పించారు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన 14402 కాల్ సెంటరు ఆధారంగా భర్త రమేష్ వాహనానికి డ్రైవరుగా, జయమ్మ కార్మికురాలిగా పనిచేస్తూ.. వచ్చిన ఆదాయంలో వాయిదాలు చెల్లించి తమ ఇద్దరు బిడ్డలను చదివించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అలా అడుగులు..
నెల్లూరులో వనపర్తి జయమ్మ, రమేష్ దంపతులు నివాసం ఉంటున్నారు. 15 ఏళ్లుగా భూగర్భ డ్రైనేజీ కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో సెప్టిక్ ట్యాంకులను ప్రైవేటుగా శుభ్రం చేసుకునేవారు. ఆ క్రమంలో విడుదలయ్యే హానికర వాయువులను పీల్చుతూ.. తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు. మూడేళ్ల కిందట తమకు సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ వాహనం మంజూరు చేయాలంటూ.. నగరపాలక సంస్థకు అర్జీ పెట్టుకున్నారు. సఫాయీమిత్ర సురక్ష ఛాలెంజ్‌లో భాగంగా ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకం కింద నెల్లూరు నగరపాలక పాలక సంస్థకు 9 సెప్టిక్ ట్యాంకులు మంజూరు కాగా.. వాటిలో ఒకటి జయమ్మకు కేటాయించారు. అలా ఆ వాహనానికి యజమానిగా ఉంటూ.. స్వయం కృషితో విధులు నిర్వహించడంతో పాటు తోటి కార్మికులకు ఆదర్శంగా నిలవడాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రపతి భవన్‌లో గణతంత్ర దినోత్సవానికి ఆహ్వాన పత్రం పంపించారు.




