
డ్రాగన్ కంట్రీ చైనా ఎల్లప్పుడూ భారత్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటోంది. చైనా ఇప్పటికే పలుమార్లు భారత్ సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కాలు దువ్వి.. తాజాగా కాశ్మీర్‌లోని ఏకంగా రోడ్ల నిర్మాణం చేపట్టింది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు బయటకు వచ్చాయి.
వివరాల ప్రకారం.. చైనా మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించింది. ఈసారి జమ్మూ కశ్మీర్‌ను చైనా లక్ష్యంగా చేసుకుంది. భారత సరిహద్దుల్లో చాపకింద నీరులా తన హద్దులను మరింత విస్తరించుకుంటూ పోతోంది. తాజాగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) భూభాగంపై కొత్తగా రోడ్లను నిర్మించింది. భారత్- పాకిస్తాన్ మధ్య అత్యంత కీలకమైన, సున్నిత సరిహద్దు ప్రాంతం సియాచిన్ గ్లేసియర్ సమీపంలో ఆఘిల్ కనుమలో గల షక్స్‌గామ్ వ్యాలీ సమీపంలో చైనా రోడ్ల నిర్మాణం చేపట్టింది.
ఇక, దీనికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే, ఈ ఫొటోల్లో.. కశ్మీర్‌లోని గిల్గిట్ బాల్టిస్టాన్ నుంచి తమ దేశంలోని గ్ఝిన్‌జియాంగ్ ప్రావిన్స్‌ను కలుపుతూ ఇప్పటికే ఉన్న జీ219 నంబర్ జాతీయ రహదారిని షక్స్‌గామ్ వేలీ వరకూ పొడిగించింది. సియాచిన్ గ్లేసియర్ సమీపంలో గల ఇందిరా కోల్ వెస్ట్ సరిహద్దకు 50 కిలోమీటర్ల దూరం నుంచి ఈ జాతీయ రహదారిని నిర్మించినట్లు శాటిలైట్ ఇమేజీలు స్పష్టం చేశాయి. మరోవైపు.. చైనా ఆక్రమణలపై మాజీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ రాకేష్ స్పందిస్తూ.. కశ్మీర్‌లో చైనా రోడ్ల నిర్మాణం నిజమేనని ధృవీకరించారు. అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టిందన్నారు. అలాగే.. ఈ విషయంలో భారత్ తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదిలా ఉండగా.. భారత్‌లో సుదీర్ఘంగా (దాదాపు 3వేల కిలోమీటర్లు) సరిహద్దును చైనా కలిగి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ సరిహద్దు ప్రాంతాల ఆక్రమణే లక్ష్యంగా చైనా ప్రవరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా చైనా ఆక్రమణలు చేపట్టింది. అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్నీ తనలో కలిపేసుకున్నట్లు మ్యాప్‌లను విడుదల చేసింది. అలాగే, అరుణాచల్‌లోని పలు ప్రాంతాలకు పేర్లను కూడా మార్చింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.





