News

వైవిధ్యాన్ని జీవన విధానంగా భారత్ స్వీకరించింది : డాక్టర్ మోహన్ భగవత్ జీ

295views

హిందుత్వ విలువల కారణంగానే జి20లో మన దేశం.. ప్రపంచ గుర్తింపు సాధించిందని, మిగతా ప్రపంచం సాధించాలని ఆకాంక్షింస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ ఉద్ఘాటించారు. కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో నిర్వహించిన అమృతశతం కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. సంస్కృతి, సమాజానికి ఉన్న లక్షణాల భారతదేశాన్ని ప్రపంచ యవనిక పై ప్రత్యేకంగా నిలుపుతోందన్నారు. ప్రపంచ వాణిజ్యం అంటే ఏంటో భారతేతర దేశాలకు తెలిసినప్పటికీ, వసుదైక కుటుంబం అంటే ఏంటో తెలియదు అని డా. మోహన్ భగవత్ జీ తెలిపారు. మరో వైపు వసుదైక కుటుంబం అనే భావంతో భారతీయులు 3 వేల సంవత్సరాల క్రితం నుంచే జీవిస్తున్నారని చెప్పారు. భారత దేశంలో భాషలు, కులాలు, మతాలు, ఆచార వ్యవహారాలు, జీవనశైలి వైవిధ్యంగా ఉన్నప్పటికీ, ఆ వైవిధ్యాన్నే జీవన విధానంగా స్వీకరించడంతో ప్రజల మధ్య ఐక్యతను, పరస్పర గౌరవాన్ని పెంపొందించిందన్నారు. భారతదేశంలో అన్ని మతాలు, కులాలు, భాషల మధ్య వైవిధ్యం ఉన్నప్పటికీ అందరిలో దేశభక్తి భావం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ పేర్కొన్నారు. భారతీయులు తమ పూర్వికుల నుంచి సాధారణ డిఎన్ఏతో పాటు సంస్కారాన్ని పంచుకున్నట్లు పలు శాస్త్రీయ అధ్యయనాల ద్వారా నిరూపితం అయ్యిందని చెప్పుకొచ్చారు.

వైవిధ్యాన్ని ఆలింగనం చేసుకొని ఒక ప్రత్యేకమైన నడత, లక్షణాలనుకలిగి ఉన్నందునే మనది హిందూ సమాజంగా గుర్తింపుపొందిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ స్పష్టం చేశారు. హిందూ సమాజంలో ఐక్యత ఎంతో అవసరం అని, ఎందుకంటే ఇటువంటి సమాజమే తనతో పాటు దేశాన్ని సైతం అభివృద్ధి పధంలో నడిపిస్తుందని… భారతదేశ పూర్వీకులు ఇతరులను జయించటానికి లేదా మార్చడానికి ఎన్నడూ ప్రయత్నించలేదని..ఉనికిలో ఉన్న సంస్కృతుల మధ్య సారుప్యత సాధనకు కృషి చేశారని తెలిపారు. భూములను కాకుండా ప్రజల హృదయాలను గెలుచుకోవడం పైనే వారు దృష్టి పెట్టారని చెప్పారు.

భారతీయ ఆలోచనా విధానంలో తనువు, మనసు, బుద్ధి మూడు పరస్పరం అనుసంధానమై ఉంటాయని డా. మోహన్ భగవత్ జీ అన్నారు. తనువు, మనసు, బుద్ధి మూడు పరస్పరం అనుసంధానం కలిగి లేకపోతే సంపద కోసం శారీరక ఆనందాన్ని కోల్పోవలసి ఉంటుంది. అలాగే ఆర్ధిక అవసరాల కోసం అడుగడుగునా అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. సంపూర్ణ శ్రేయస్సు, మోక్షం కోసం శరీరం, మనస్సు, బుద్ధి మూడింటిని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ మార్కెట్ ను దాటి ప్రపంచమే కుటుంబం అనే అత్యున్నత భావనను తనలో ఇనుమడించుకోవడంతో వేల సంవత్సరాలుగా మనం కొనసాగిస్తున్నా వసుదైక కుటుంబం అనే భావనను జీ20 శిఖరాగ్రా సదస్సులో ప్రపంచ దేశాలు స్వాగతించాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ జీ తెలిపారు.

భారతీయులకే సొంతమైన విశిష్ట విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించడంలో హిందూ సమాజం కృషి చేయాలని, అలాగే బోధించే వాటిని ఆచరించాల్సిన అవసరం ఉందని డా. మోహన్ భగవత్ జీ స్పష్టం చేశారు. సమాజ అవసరాలను అర్థం చేసుకుని, దాని అభివృద్ధికి కృషి చేసే వ్యక్తులకు శిక్షణ ఇవ్వడంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. సంస్థ లక్ష్యం దాని స్వంత ప్రయోజనాల కోసం కాదని, దేశం మరియు దాని ప్రజల అభ్యున్నతి కోసమే అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ ఉద్ఘాటించారు.