News

ఘనంగా గో పూజోత్సవం

286views

కనుమ పండుగ సందర్బంగా విజయనగరం జిల్లావ్యాప్తంగా దేవదాయశాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో గో పూజలు నిర్వహించారు. మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణ నడుమ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. విజయనగరంలో పైడిమాంబ ఆలయం, శివాలయం వీధిలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయం, మన్నార్‌ రాజగోపాల స్వామి ఆలయంలో గో పూజ నిర్వహించారు. ఈవోలు జీవీఎస్‌ సుబ్రహ్మణ్యం, రమణ, ఆలయ అర్చకులు, సిబ్బంది, వైసీపీ మహిళా విభాగం నేత కోలగట్ల శ్రావణి, మాజీ కౌన్సిర్లు ఎస్‌వీవీ రాజేష్‌, ఆశపు వేణు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధి గాంచిన గరుగుబిల్లి మండలం తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాలు, చీపురుపలిలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం, ఎస్‌.కోట మండలంలోని ప్రాచీనశైవక్షేత్రం ధర్మవరం సమీపంలోని సన్యాసేశ్వరస్వామి ఆలయం, శృంగవరపుకోటలో ధారగంగమ్మతల్లి దేవాలయంలో గోశాలలో పూజలు చేశారు. మక్కువ మండలం శంబర పోలమాంబ అమ్మవారి చదురు గుడి ఆవరణలో, నెల్లిమర్ల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానంలో గోపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చకులు, ఈవోలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.