
శ్రీశైల క్షేత్రంలో నవంబరు 2 నుంచి డిసెంబరు వరకు జరగనున్న కార్తిక మాసోత్సవాల ఏర్పాట్లను దేవస్థాన ఇన్‌చార్జ్ ఈఓ ఇ.చంద్ర శేఖర్‌రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. క్యూలైన్లు, లడ్డూప్రసాదాల తయారీ, ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం పుష్కరిణిహారతి, పాతాళగంగ, పార్కింగ్ ప్రదేశాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసాదాల తయారీలో శుభ్రతలను పాటించాలన్నారు. శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవురోజులు, పర్వదినాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాల తయారు చేసుకోవాలన్నారు. భక్తులు కోరినన్ని లడ్డూప్రసాదాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పుష్కరిణి వద్ద లైటింగ్, పుష్పాలంకరణ చేయాలని, ఆలయ ఉత్తరమాడవీధులలో భక్తులు దీపాలను వెలిగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పాతాళగంగ పరిసరాలను, పాతాళగంగమెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.




