News

సింహగిరిపై వేడుకగా వినోదోత్సవం

259views

సింహాచలం అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. తాము స్వామి దర్శనానికి వచ్చాం తప్ప చోరులం కాదని కంటతడి పెట్టుకున్నారు. చివరికి ఇదంతా ఉత్సవంలో భాగమని తెలుసుకుని ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. మంగళవారం రాత్రి దొంగల దోపు వేడుకలో కనిపించకుండా పోయిన స్వామివారి ఉంగరాన్ని వెతికే ఘట్టం వినోదోత్సవం బుధవారం ఉదయం జరిగింది. స్వామివారిని ముత్యాల పల్లకీలో అధిష్ఠింపజేసి ఆలయ రాజగోపురం ఎదుట కొలువుదీర్చారు. రక్షక భటుడి వేషధారణలో ఆలయ అలంకారి పురోహితుడు కరి సీతారామాచార్యులు అనుమానితులను బంధీలుగా తీసుకువచ్చారు. వారిని ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ విచారణాధికారిగా ప్రశ్నించారు. ఈ ఘట్టాన్ని అత్యంత నాటకీయంగా వినోదాత్మకంగా నిర్వహించారు. తర్వాత స్వామివారి మేలి ముసుగులో ఉంగరం దొరికిందంటూ చూపడంతో ఈ ఉత్సవం ముగిసింది.