News

విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు.. గర్భాలయ అర్చకత్వానికి అనుమతి లేదు

83views

దేశీయానం చేసిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి, పూజలు నిర్వహించడానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్‌), శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మార్చి 30న ఉత్తర్వులిచ్చారు. ఈ అంశానికి సంబంధించి దేవాదాయ శాఖ 2010 నవంబరు 10న జారీ చేసిన సర్క్యులర్, శృంగేరి శారదా పీఠం జగద్గురువులు మహాతీర్థ భారతీస్వామి 2024 డిసెంబరు 20న విడుదల చేసిన ‘ప్రామాణిక’ను అమలు చేయడం లేదంటూ విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డీఎస్‌ఎస్‌ఎస్‌ సుబ్రహ్మణ్యం సోమయాజి వ్యాజ్యం దాఖలు చేశారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది కేఆర్‌ శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. విదేశీయానం చేసిన అర్చకులను నిబంధనలకు విరుద్ధంగా దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అనుమతిస్తున్నారన్నారు. ధార్మిక పరిషత్‌ సర్క్యులర్, శారదాపీఠం ప్రామాణిక ప్రకారం అర్చకులకు విదేశాలకు వెళ్లడానికి అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా వెళ్లాల్సిందేనని పట్టుబడితే అనుమతి ఇవ్వవచ్చని, తిరిగి వచ్చాక వారిని ఆలయం వెలుపల జరిగే పూజలు, వ్రతాలకు మాత్రమే అనుమతిస్తారని వెల్లడించారు. భారతీస్వామి ప్రామాణిక ప్రకారం.. రోజూ త్రికాల సంధ్యావందనం, గురు ఉపదేశ మంత్ర జపం, వేద అధ్యయనం, ఆహార నియమాలు, కఠిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించిన వారు గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అర్హులని వివరించారు. విదేశాలకు వెళ్లినవారు, సంప్రదాయాలకు విరుద్ధంగా ముఖ క్షవరం, జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలో పూజలు చేయడానికి వీల్లేదని ప్రామాణిక చెబుతోందన్నారు. దీనిపై దేవాదాయ శాఖ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. సర్క్యులర్, ప్రామాణికలను అనుసరిస్తామన్నారు.