
సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్న కేసులో జమ్మూ-కశ్మీర్‌లో నిన్న చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు గురువారం కూడా కొనసాగాయి. కశ్మీర్ లోయలోని 9 చోట్ల, ఢిల్లీలోని ఒక చోట అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నేరపూరితమైన పలు దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఛారిటీ అలియన్స్, హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్, శ్రీనగర్‌లోని ఫలా ఇ ఆమ్ ట్రస్ట్, జేకే యతీమ్ ఫౌండేషన్, సాల్వేషన్ మూమెంట్, జేకే వాయిస్ ఆఫ్ విక్టిమ్స్ ఎన్జీవో కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగినట్లు తెలిపింది.
బుధవారం శ్రీనగర్, బండిపొరాల్లోని 10 చోట్ల, బెంగళూరులోని ఒక చోట ఎన్‌ఐఏ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. పలు సేవా సంఘాలు, సామాజిక సంస్థలు దేశ విదేశాల నుంచి విరాళాలు సేకరించి.. ఆ నిధులను జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సాయం అందించేందుకు ఉపయోగిస్తున్నాయనే సమాచారం మేరకు అక్టోబరు 8న ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే తాజా సోదాలు చేపట్టింది.





