NewsSeva

పర్యావరణ హితం.. సంఘ్‌ సంకల్పం

44views

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఈ విజయదశమి పండగకు 99 ఏళ్లు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో పర్యావరణ రక్షాబంధన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం నుంచి 26వ తేదీ వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 53 రెవెన్యూ డివిజన్లు, గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటి వాటికి రాఖీ కట్టి, మొక్కకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని సంకల్పించింది. ఇందుకోసం 4,384 మంది స్వయం సేవకులు పని చేయనున్నట్లు ఆరెస్సెస్‌ సంఘ్‌ చాలక్‌ డా.వాసురెడ్డి వెల్లడించారు.

ఆగస్టు 18 నుంచి 26వ తేదీ వరకు పర్యావరణ రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 53 రెవెన్యూ డివిజన్లు, పంచాయతీల్లోని 1,287 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. వీరంతా సామాజిక పరివర్తన సాధించేందుకు పర్యావరణం, స్వదేశీ స్వావలంబన్, కుటుంబ ప్రబోధన్, సామాజిక సమరసతా, పౌర విధులు జరుపుకొనే విధంగా వేడుకలు నిర్వహిస్తారు.

  • జాతీయ పర్యావరణ నివేదిక ప్రకారం మనిషి సాధారణ జీవనానికి 83 చెట్లు అవసరమని, కానీ ప్రస్తుతం ఒకరికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయని గణంకాలు చెబుతున్నాయన్నారు. ప్రతి పంచాయతీల్లో స్వయం సేవకులందరూ 100 మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో 25 వేలు మొక్కలను పంచాయతీలకు పంపిణీ చేశారు.
  • పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్‌ నిషేధిస్తూ ప్రతి ఒక్కరూ చేతి సంచి వాడాలని, వారం రోజుల్లో రెండు లక్షల కుటుంబాలను కలిసి అవగాహన కల్పిస్తారు. దీంతోపాటు జల సంరక్షణ, నీటి పొదుపుపై ప్రజలకు తెలియజేయనున్నారు.