News

ఢిల్లీలో పాకిస్తాన్ అనుకూల స్లోగన్స్..

54views

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. రోహిని ఏరియాలో ఓ వ్యక్తి ఇంట్లో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు కనిపించాయి. అతని ఇంటి గోడపై ‘పాకిస్థాన్ లాంగ్ లైవ్’ అని రాసి ఉంది. దానిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని, ఇంటిని పరిశీలించారు.

అనుకూల స్లోగన్స్
‘స్థానికుల సమాచారంతో రోహిని ఏరియాకు వచ్చాం. అవంతిక సీ బ్లాక్ ప్రాంతంలో ఓ ఇంటిలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు రాసి ఉన్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు.. ఇంట్లో ఆ వ్యక్తి ఒక్కరే ఉంటున్నారని తెలిసింది. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని నిర్ధారించుకున్నాం. అయినప్పటికీ పాకిస్థాన్, లేదంటే ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధం ఉందా అనే విషయంపై ఆరా తీస్తున్నాం. ఆ క్రమంలో సదరు వ్యక్తి బంధువులను సంప్రదించాం. ఆ ఇంట్లో ఉన్న బ్యానర్, పోస్టర్‌ను సీజ్ చేశాం అని’ పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వివరించారు.

వీడియో షేర్..
ఆ వ్యక్తి ఇంట్లోకి పోలీసులు వెళ్లే సమయంలో కొందరు స్థానికులు కూడా వెళ్లారు. ఆ సమయంలో ఓ వీడియో తీసి పోస్ట్ చేశారు. ఇంటి గోడపై పాకిస్థాన్‌కు అనుకూలంగా రాసిన స్లోగన్ కనిపించింది. తర్వాత మరో గదిలోకి వెళ్లగా చీకటి ఉంది. గది మధ్యలో మద్యం బాటిల్ పట్టుకున్న ఓ వ్యక్తిని గుర్తించారు. గది చీకటి ఉండటంతో మొబైల్ ప్లాష్ లైట్లు వేయడంతో కనిపించారు. ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగగా నాకు పాకిస్థాన్ అంటే ఇష్టం అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు. మరోసారి ఇలా చేయొద్దని అతనికి చెప్పి వచ్చేశారు